టార్గెట్లపై ఏపీ సచివాలయ ఉద్యోగుల ఫైర్..! సీఎం మాటలూ లెక్కలేదా ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్ధలో కూటమి సర్కార్ పెను మార్పులు చేస్తోంది. తాజాగా హేతుబద్ధీకరణ పేరుతో సచివాలయాలు, వాటి సిబ్బందిలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే దీని వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్ధితి. అదే సమయంలో ఉన్నతాధికారుల వేధింపులపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ నినాదానికి తూట్లు పొడుస్తూ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తూ, వేధిస్తున్న క్షేత్రస్థాయి అధికారుల తీరును ఖండిస్తున్నామని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆరోపించింది. ఆదివారాలు,పండుగ రోజులు సెలవు ఇవ్వాల్సిందేనని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.డి.జాని పాషా, బత్తుల అంకమ్మరావు డిమాండ్ చేశారు.

ఆదివారం లేదా సెలవు రోజున ఒకటో తేదీ వచ్చిన సందర్భంలో ఒకరోజు ముందుగా ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా సామాజిక పింఛన్ పంపిణీ చేయిస్తున్నారని, ఇలాంటి సందర్భంలో క్షేత్ర స్థాయి అధికారులు వివిధ రకాల సర్వేల పేరిట సమయపాలన లేకుండా టార్గెట్లు విధించి సచివాలయ ఉద్యోగులను తీవ్ర మానసిక వత్తిడికి గురిచేస్తూ వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
సెలవులు,ఆదివారాలు,పండగ రోజులతో సంబంధం లేకుండా ప్రతి పనికీ టార్గెట్లు విధిస్తూ ఉద్యోగులను కుటుంబ జీవితానికి దూరం చేస్తున్నారన్నారు.సర్వేల టార్గెట్లు పన్ను వసూళ్ళ టార్గెట్లతో ఉద్యోగులు భయాందోళనకు,తీవ్ర వత్తిడికి గురవుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఒక వైపు వివిధ సర్వేల కోసం పదే పదే ఉద్యోగులు ఇళ్ళకు వెళ్తున్న సందర్భంలో ప్రజల నుండి పూర్తి స్థాయిలో సహకారం లభించకపోగా,ఓటీపీలు చెప్పడానికి నిరాకరిస్తున్నారని వారు వెల్లడించారు. అలాగే ఈ సర్వేల వలన తమకు ఎటువంటి ఉపయోగం ఉండదని, తమకు అవసరం లేదని, ఈ మధ్యనే వచ్చారు కదా మళ్ళీ ఎన్నిసార్లు వస్తారని రకరకాలుగా ప్రజల నుండి ఇబ్బందులు తలెత్తున్నాయన్నారు. ఈ క్రమంలో వారిని ఒప్పించడం చాలా కష్టతరమవుతుందన్నారు. ఒక వైపు అధికారుల వత్తిడి, మరోవైపు ప్రజల నుండి అరకొర సహకారం ఉంటోందన్నారు.
అలాగే అధికారులు సచివాలయం పరిధి నుండి మండల,, మున్సిపాలిటీ,జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతి పనికి ర్యాంకింగుల పేరిట సచివాలయ ఉద్యోగులను తీవ్ర వేదనకు గురిచేస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ లో ఉద్యోగులు ప్రశాంతంగా హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని , ఉద్యోగులకు కార్యాలయ పనివేళలు కానీ సమయాలలో టెలీ, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించవద్దని చెప్తున్నారని, అయినా క్షేత్ర స్థాయి అధికారులు ఈ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై పని వత్తిడిని తొలగించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications