AP weather: ఏపీలో మరో మూడురోజులపాటు వానలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది.
శనివారం ఉదయానికి వాయువ్య, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వీటి ప్రభావంతో ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కాగా, తమిళనాడు-శ్రీలంక తీరాలను ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Recommended Video
కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కాసేపు వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. గుంటూరు మూడు వంతెనల కూడలి వద్ద వర్షపు నీరు చేరడంతో వాహన రాకపోకలకు కాసేపు ఇబ్బంది కలిగింది. ఒంగోలు పట్టణంలో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో పలు వీధుల్లో వరద నీరు చేరింది. గాంధీ రోడ్డు, బస్టాండ్ రోడ్డు, సుజాతనగర్, కర్నూల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ప్రకాశం జిల్లా కురుస్తోన్న వర్షాలకు భైరవకోన జలపాతం వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. కాగా, బద్వేలు ఉపఎన్నిక పోలింగ్ శనివారం జరగనున్న విషయం తెలిసిందే. భారీ వర్షం కురిస్తే ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications