జగన్ ఫ్యామిలీపై పోస్టులు పెడుతున్నా.. ! మహిళా కమిషన్ ఛీఫ్ వాసిరెడ్డి పద్మ ఆవేదన..
ఏపీలో ఎన్నికల ఏడాది అధికార, విపక్షాల మధ్య పోరు పెరుగుతోంది. అయితే ఇది రాజకీయంగా మాత్రమే పరిమితం కావడం లేదు. వ్యక్తిగత దాడుల వరకూ వచ్చేస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని బయట టార్గెట్ చేస్తున్న విపక్షాలు, వాటి క్యాడర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంతకు మించి టార్గెట్ చేస్తున్నారు. అయితే వీటిపై చర్యలు తీసుకునే విషయంలో పోలీసులు ఏమీ చేయలేని పరిస్దితి ఉందని ఇవాళ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా పోస్టులు పెట్టినా చర్యలు తీసుకోలేనీ పరిస్థితుల్లో ఉన్నట్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇవాళ తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా హత్యలు చూస్తున్నామన్నారు. మహిళల పై మహిళలే పోస్టులు పెడుతున్న పరిస్థితులు దాపురించాయన్నారు. రాజకీయ నేతలను కించ పరచడానికి వాళ్ల ఇళ్లల్లోని మహిళలపై పోస్టింగులు పెట్టడం సరికాదన్నారు. రెండువైపులా ఈ తరహా ధోరణులు జుగుప్సాకరంగా పరిస్థితులు ఉన్నాయని పద్మ తెలిపారు.

శ్వేతా చౌదరి అనే మహిళ స్వాతి రెడ్డి అనే ముసుగు వేసుకుని అశ్లీలంగా మాట్లాడితే చంద్రబాబు ప్రొత్సహిస్తారా..? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. చివరకు స్వాతి రెడ్డి కూడా సోషల్ మీడియా బాధితురాలు అయిందన్నారు. సోషల్ మీడియా పోస్టింగులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారనే చర్చ జరగాలన్నారు. ఓక పోస్టింగ్ మీద చర్యలుంటే దీనికి కట్టడి పడుతుందేమో అని అభిప్రాయపడ్డారు. వ్యక్తిత్వ హననం అనేది హత్యానేరంతో సమానంగా చూడాలని పద్మ కోరారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగులపై చర్యలు తీసుకునేలా చట్టాలు సవరించాలని కోరుతున్నట్లు వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. సోషల్ మీడియా వ్యవహారం పై జులై 5వ తేదీన మహిళా కమిషన్ సెమినార్ నిర్వహిస్తుందన్నారు. సీఎం ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీద ట్రోలింగులు జరుగుతోన్నా.. ఏం చర్యలు తీసుకోలేని దుస్థితిలో ఉన్నామన్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్టులు చేయొద్దని కోర్టులు చెబుతున్నాయని పద్మ తెలిపారు. యాసిడ్ దాడిని ఎలా చూస్తున్నామో.. సోషల్ మీడియాలో మహిళలపై ట్రోలింగులను ఇదే తరహాలో చూడాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications