బాబు దుమ్ముదులిపిన రఘువీరా
అనంతపురం: శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేస్తూపోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీరును ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తప్పుబట్టారు. చంద్రబాబుకు శంకుస్థాపనల పిచ్చి పట్టిందని ధ్వజమెత్తారు. ఏపీ కొత్త రాజధాని అమరావతికి ఇంకా ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారని నిలదీశారు. శనివారం రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఏపీకి రూ. 2 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తున్నామన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అన్ని రాష్ట్రాలకు నిధులు వచ్చినట్టుగానే ఏపీకి కూడా నిధులు కేటాయిస్తున్నారని, అంతేతప్ప ప్రత్యేక ప్యాకేజీ కోసం ఇస్తున్నదేమీ లేదని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంతా బోగస్ అని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. విభజన చట్టాన్ని అమలుచేయకుండా ప్రత్యేక ప్యాకేజీ అనడం ద్రోహం చేయడమేనన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని టీడీపీ, బీజేపీ ప్రకటిస్తాయేమోనని సందేహం వ్యక్తం చేశారు. నిధులు దుర్వినియోగం చేయొచ్చన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారని దుయ్యబట్టారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తామనడం మోసానికి పరాకాష్ట అని అన్నారు. అబద్ధాలను చెప్తూ ప్రజలను పదేపదే చంద్రబాబు దగా చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications