YS Sharmila: వైఎస్ షర్మిలకు వైరల్ ఫీవర్..టూర్లన్నీ క్యాన్సిల్ ?
ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ పగ్గాలు అందుకున్న వైఎస్ షర్మిల తీరిక లేకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే రోజుకు మూడు జిల్లాల చొప్పున 9 రోజుల్లో సమీక్షలు పూర్తి చేసిన షర్మిల.. రెండో విడత టూర్ కు సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లాలో ఇవాళ స్ధానికంగా పలు కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్న షర్మిల ఆకస్మికంగా వీటిని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న షర్మిల.. అనంతపురం టూర్ రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టగానే జిల్లాల్లో పర్యటించి స్ధానిక పరిస్ధితుల్ని తెలుసుకున్న షర్మిల.. మరోవైపు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో అభ్యర్ధుల్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తీరిక లేని షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నారు. అయితే అంతకు ముందు ఇంత సుదీర్ఘంగా తిరిగిన అనుభవం లేకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమెకు వైరల్ ఫీవర్ సోకడంతో అనంతపురం టూర్ ను రద్దు చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు.

వాస్తవానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో షర్మిల పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఇందులో ఇవాళ మడకశిర బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. రేపు సింగనమల నియోజకవర్గం నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. సహాపంక్తి భోజనం, కూలీలతో ముఖాముఖి కూడా ప్లాన్ చేశారు. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, విభజన హామీలను జనంలోకి తీసుకెళ్లే విధంగా క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సి ఉంది. కానీ షర్మిల వైరల్ ఫీవర్ కారణంగా ఈ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications