మోడీ 'మట్టి' రాజకీయం: 'ఏపీకి ప్రత్యేక సాధన కోసం కాంగ్రెస్ మట్టి సత్యాగ్రహం'
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించని ప్రధాని మోడీ, రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఢిల్లీ మట్టి, యమునా నీటిని తీసుకొచ్చిన వైనంపై ఆయన మండిపడ్డారు.
ప్రధాని మోడీ 'మట్టి' రాజకీయానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు, ఏపీకి ప్రత్యేకహోదా సాధన కోసం 'మట్టి సత్యాగ్రహం' చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వినూత్న నిరసనకు స్ఫూర్తినిచ్చింది తన సొంత నియోజకవర్గానికి చెందిన ఇద్దరు మహిళా సర్పంచ్‌లంటూ తెలిపారు.
వారు సేకరించిన మట్టిని ప్రధాని నరేంద్రమోడీకి పంపించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోడికి మట్టిని పంపించడం అనేది ఏపీ ప్రజల జన ఘోషగా అభివర్ణించారు. గంగులవాయి పాలెం సర్పంచ్ లక్ష్మీ దేవమ్మ ఇచ్చిన మట్టితో పాటు ఆమె ప్రధాని మోడీకి రాసినటువంటి లెటర్‌ను ఈరోజు కొరియర్ ద్వారా పంపించనున్నట్టు పేర్కొన్నారు.

దీంతో పాటు ఏపీలోని 16 వేల గ్రామాల నుంచి మట్టిని సేకరించి ప్రధాని మోడీకి పంపనున్నట్లు ఆయన ప్రకటించారు. వీటితో పాటు ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేతాల నుంచి సైతం మట్టిని సేకరిస్తున్నామన్నారు. ఎందుకంటే తిరుపతిలో ప్రధాని మోడీ మాట ఇచ్చారని పేర్కొన్నారు.
తాము మట్టి సేకరిస్తున్న గ్రామాల జాబితాలో చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వగ్రామం చవటవారిపల్లి, సుజనా చౌదరి గ్రామం కంచికచర్ల, అశోక్ గజపతి గ్రామం విజయనగరం కోట కూడా ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి సేకరించిన మట్టి మూటలను ప్రధాని మోడీకి కొరియర్ చేస్తామని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications