Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి మరో షాక్- మళ్లీ సీఐడీ పిలుపు..!
ఏపీలో రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినా మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని పాత కేసులు వెంటాడుతున్నాయి. గతంలో కాకినాడ పోర్టు వాటాల బదిలీకి యజమానుల్ని బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డిని ఇప్పటికే ఓసారి విచారించిన సీఐడీ అధికారులు.. మరోసారి విచారణకు రావాలని ఇవాళ నోటీసులు పంపారు. దీంతో సాయిరెడ్డి మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సిద్దమవుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ పోర్టు యజమాని కేవీరావును బెదిరించి తన బంధువులకు వాటిని రాయించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డిని ఈ నెల 25న మరోసారి విచారణకు రావాలని సీఐడీ నోటీసులు పంపింది. కాకినాడ పోర్టుతో పాటు సెజ్ వ్యవహారంలోనూ ఆయన్ను ప్రశ్నించాల్సి ఉందని సీఐడీ తెలిపింది. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డితో పాటు మొత్తం ఆరుగురిపై సీఐడీ కేసు నమోదైంది.

దీనిపై గతంలో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డిని సీఐడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే విచారణ తర్వాత అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి పంపారు. అలాగే ఈ విచారణలో విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంతో తనకు అస్సలు సంబంధం లేదని, దీనికి కర్త, కర్మ, క్రియ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని సీఐడీకి చెప్పారు. ఈ విషయం విచారణ తర్వాత బయటికి వచ్చి మీడియాతో కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈసారి విచారణలో సాయిరెడ్డి ఎవరెవరి పేర్లు బయటపెట్టబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications