జడ్డీలపై సోషల్ పోస్టులు-చంద్రబాబు, రఘురామ ఆరోపణలపై డిజిటల్ కార్పోరేషన్ వివరణ
ఏపీలో హైకోర్టు జడ్డీలపై సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఏపీడీసీఎల్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ డిజిటల్ కార్పోరేషన్ కేంద్రంగానే జడ్డీలపై సోషల్ మీడియా పోస్టులు పెట్టారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఆరోపణలపై డిజిటల్ కార్పోరేషన్ వీసీ, ఎండీ చిన్న వాసుదేవరెడ్డి ఇవాళ వివరణ ఇచ్చారు.
డిజిటల్ కార్పోరేషన్ కేంద్రంగానే హైకోర్టు జడ్జీలపై సోషల్ మీడియా పోస్టులు పెట్టారంటూ చంద్రబాబు, రఘురామ చేస్తున్న ఆరోపణలు, వాటిపై ఏబీఎన్ నెట్ వర్క్, టీవీ 5లో ప్రసారం చేస్తున్న కథనాలపై సంస్ధ వీసీ, ఎండీ వాసుదేవరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు, రఘురామ చేసిన ప్రతీ ఆరోపణకూ ఆయన ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. ఏపీడీసీఎల్ ఏర్పాటుకు 2020 ఏప్రిల్ లో ఉత్తర్వులు వెలువడినా ఆ ఏడాది సెప్టెంబర్ లోనే అధికారికంగా ఏర్పాటైందన్నారు. ఏడాదికి రూ.100 కోట్లు ఈ సంస్ధకు ప్రభుత్వం నిధులు ఇస్తోందని చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. తొలి ఏడాది రూ.4 కోట్లు, రెండో ఏడాది రూ.12 కోట్లు మాత్రమే నిధులు వచ్చాయన్నారు.

అలాగే తాను ఇప్పటి వరకూ సంస్ధ నుంచి జీతం కూడా తీసుకోలేదని వాసుదేవరెడ్డి తెలిపారు. తన సొంత ఖర్చులతోనే ప్రయాణాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై చేసిన ఆరోపణలకు ఆయన రఘురామ రాజు క్షమాపణ చెప్పాలని కోరారు. జడ్డీలపై సోషల్ పోస్టుల వ్యవహారం 2020 ఏప్రిల్, మే నెలల్లో వెలుగుచూసిందని, అప్పటికి ఇంకా తమ కార్పోరేషన్ ఏర్పాటు కాలేదన్నారు. సీబీఐ నుంచి కూడా ఈ విషయంలో తమకు ఎలాంటి నోటీసులూ అందలేదన్నారు. డిజిటల్ కార్పోరేషన్ లో వైసీపీ కార్యకర్తల్ని ఉద్యోగులుగా తీసుకున్నారన్న ఆరోపణల్నీ తప్పుబట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల్ని తీసుకున్నామని, ఫోన్ పే వంటి యూపీఐల ద్వారా వారికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఏపీడీసీఎల్ క్యాసినో గేమ్స్ లో పాలుపంచుకుంటోందంటూ చేసిన మరో ఆరోపణ హాస్యాస్పదమని వాసుదేవరెడ్డి తన వివరణలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications