స్ట్రైక్: ప్రభుత్వంపై కోర్టు సీరియస్, పిటిషనర్‌పై ఎపిఎన్జీవో
హైదరాబాద్: ఎపిఎన్జీవోల సమ్మె విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమైక్యాంధ్ర సమ్మెపై వేసిన పిటిషన్ పైన వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం సమ్మె విరమింప చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నదని, ఇప్పటి వరకు ఎందుకు సమ్మెను నిలుపుదల చేయలేకపోయారని ప్రశ్నించింది.
దానికి ప్రభుత్వం తరఫు న్యాయవాది... తాము ఎపిఎన్జీవోలతో ఎప్పటికి అప్పుడు చర్చలు జరుపుతున్నామని, మంత్రుల సంఘం వారితో చర్చిస్తోందని చెప్పారు. సమ్మె చేస్తున్నప్పటి నుండి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. సమ్మె నిలుపుదల కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మంత్రులు జరిపే సంప్రదింపుల వల్ల ఫలితం ఉండదని, ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది.

తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా కోర్టు నిరాకరించింది. సమ్మెపై సమ్మెను కట్టడి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఎపిఎన్జీవోల సమ్మెపై తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
పిటిషనర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు: ఎపిఎన్జీవో
సమైక్యాంధ్ర ఉద్యమంపై పిటిషన్ వేసిన పిటిషనర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఆయన పిటిషన్ విచారణార్హం కాదని ఎపిఎన్జీవోల తరఫు న్యాయవాదు కోర్టుకు తెలిపారు. ఉద్యమంతో తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఇప్పటి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. సమ్మె విషయంలో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చామని చెప్పారు.
అధికారికంగా విభజన జరగలేదు: కేంద్రం లాయర్
రాష్ట్ర విభజన ఇంకా అధికారికంగా జరగలేదని కేంద్రం తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.
విడిపోదనే సంకేతాలు వచ్చే వరకు ఉద్యమం: అశోక్ బాబు
రాష్ట్రం విడిపోదనే సంకేతాలు కేంద్రం నుండి వచ్చే వరకు తమ ఉద్యమం ఆగదని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మంగళవారం చెప్పారు. తాము రాజకీయ నాయకులపై దాడులు చేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారని, పార్టీలు చేసుకునే గొడవలకు తమకు సంబంధం లేదన్నారు. ఎవరిపైన దాడులు చేయాలని తాము చెప్పలేదన్నారు. ఉద్యోగులు ఏ రాజకీయ నాయకుడి పైన దాడులు చేయలేదన్నారు.
తాము పదవులు ఆశించి ఉద్యమించడం లేదని, సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నామన్నారు. తమకు ఏ ఒక్క రాజకీయ పార్టీని భుజానికెత్తుకునే అవసరం లేదన్నారు. సమైక్యాంధ్రపై కేంద్రానికి నచ్చజెప్పే బాధ్యత రాజకీయ నాయకుల పైనే ఉందన్నారు. రాజీనామాలు చేయకుండా విభజనను ఎలా అడ్డుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ నెల 20న విజయవాడలో, 23న హిందూపురంలో ప్రయివేటు వాహనాల బందు ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications