ఇజ్రాయెల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల కోసం హెల్ప్ డెస్క్-నంబర్లు ఇవే..
పాలస్తీనా తీవ్రవాద సంస్ధ హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన ఏపీ వాసుల కోసం ప్రభుత్వ సంస్ధ APNRTS హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో అక్కడ చిక్కుకుపోయిన ఏపీ వాసుల్ని ఆదుకునేందుకు హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇజ్రాయెల్ లో ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా శాంతి భద్రతలపై ఆందోళన నెలకొన్నందున భారత రాయబార కార్యాలయం భారతీయుల సంక్షేమం కోసం ముఖ్య సూచనలు కూడా చేసింది.
ఇజ్రాయెల్ లోని భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ఇజ్రాయెల్ ప్రభుత్వ భద్రతా నియమాలను గమనించి జాగ్రత్త వహించాలని, అనవసరమైన ప్రయాణాలను విరమించుకోవాలని కోరింది. అలాగే స్థానిక ప్రభుత్వ అధికారులు సూచించిన విధంగా సురక్షిత ప్రదేశాలకు దగ్గరగా ఉండాలని ఇజ్రాయిల్ లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచనలను విడుదల చేసింది.

ఇజ్రాయెల్ లో పరిస్థితి క్షీణించినప్పుడు, స్వదేశానికి తిరిగి రావాల్సిన అవసరం ఏర్పడితే ప్రవాసాంధ్రులను సురక్షితముగా వెనక్కి తీసుకురావటానికి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ఏపీఎన్ఆర్టీఎస్ సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయానికి ఇమెయిల్ పంపింది. ఇజ్రాయెల్ వెళ్లాలని అనుకునే వారు కూడా అక్కడి పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే వరకు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరింది.
అలాగే ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయ పౌరులు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం, వారి వివరాల నమోదు కొరకు భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నెంబర్ +972 35226748 లేదా ఇమెయిల్ [email protected] ను సంప్రదించాలని అధికారులు కోరారు. ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు +91 8500027678 (వాట్సాప్), 0863 2340678 ను సంప్రదించాలని సూచించారు. అలాగే మీ కుటుంబసభ్యులు లేదా మిత్రులు లేదా తెలిసిన వారు ఎవరైనా ఇజ్రాయెల్ లో ఉంటే, ఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించి వివరాలు తెలపాలని కోరారు.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
APNRTS












Click it and Unblock the Notifications