పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తుల వెల్లువ .. వారి కోసం జగన్ సర్కార్ కు జనసేనాని సీరియస్ వార్నింగ్ !!
రాష్ట్రంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోమారు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే జనసేన ప్రధాన లక్ష్యం అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక జనసేనాని ఏపీ రాకతో భవన నిర్మాణ రంగ కార్మికులు, నిరుద్యోగులు , తాడేపల్లి కరకట్ట వాసులు పవన్ కళ్యాణ్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. ఆయనకు విజ్ఞప్తుల వెల్లువ కొనసాగుతుంది.

పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ అయిన పవన్
ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై పార్టీ నాయకులతో చర్చించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీలో పనిచేస్తూ బారినపడి మృతి చెందిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. నంద్యాలకు చెందిన సోమశేఖర కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారని, చాలామంది జనసైనికులను కూడా జనసేన పార్టీ పోగొట్టుకుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడం కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని వెల్లడి
ఇదే సమయంలో పార్టీ బీమా పథకానికి తాను కోటి రూపాయలు ఇచ్చాను అని అందరూ తమ వంతు సహకారం అందిస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అందరి అభిమానం, నాయకుల అండతో పార్టీ నిలబడిందని ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడం కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై పార్టీ నాయకులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ను పార్టీ కార్యాలయంలో నిరుద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కలిశారు.

పవన్ కు గోడు వెళ్లబోసుకున్న నిరుద్యోగులు
జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి లక్షల మంది నిరుద్యోగులను మోసం చేస్తున్నారని వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు.ఎన్నికలకు ముందు ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇప్పుడు ఆ ఊసే లేకుండా చేస్తున్నారని, జాబ్స్ అడిగితే జైలుకు పంపిస్తున్నారని లబోదిబో మన్నారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10 వేల ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ గా ప్రకటించి జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు నట్టేట మునిగామని నిరుద్యోగులు పవన్ కళ్యాణ్ కు తమ గోడు చెప్పుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను విన్న జనసేనాని
నిరుద్యోగుల గోడు విన్న జనసేన పవన్ కళ్యాణ్ వారి సమస్య పరిష్కారానికి పీఏసీలో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులు సైతం పవన్ కళ్యాణ్ ని కలిశారు. భవన నిర్మాణ కార్మికులను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారికి రావలసిన సంక్షేమ పథకాలను ఇవ్వడం లేదని వారు పవన్ కళ్యాణ్ ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరోనా కష్టకాలంలో పనుల్లేక భవన నిర్మాణ రంగం కుదేలయిందని తెలిపిన భవన నిర్మాణ కార్మికులు ప్రస్తుత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తాడేపల్లి కరకట్ట వాసుల సమస్యలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్
కార్మికుల కష్టాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వారి సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.సీఎం ఇంటి భద్రత పేరుతో తమ ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు అంటూ తాడేపల్లి కరకట్ట వాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తనను కలిసిన తాడేపల్లి కరకట్ట వాసులకు పవన్ కళ్యాణ్ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తాడేపల్లి కరకట్ట వాసులు తమను ఇల్లు ఖాళీ చేయవలసిందిగా నోటీసులు ఇచ్చారని, ముందు స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఉన్నఫళంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు.

సీఎం భద్రత పేరుతో తమ ఇళ్ళు ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన
అర్ధరాత్రి ఇళ్ల మీదకు ప్రొక్లైనర్ లను పంపిస్తున్నారని, అదేమని అడిగితే చెప్పలేని విధంగా బూతులు తిట్టి బెదిరిస్తున్నారు అంటూ వారి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు. ముప్పై ఏళ్ల నుండి తాము అక్కడే జీవిస్తున్నామని ఇప్పుడు తమకు నిలువనీడ లేకుండా చేస్తున్నారని, తమ పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేయాలని వారు పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి కరకట్ట వాసుల గోడు విన్న పవన్ కళ్యాణ్ సిఎం ఇంటి చుట్టూ ఉన్న వారికే రక్షణ లేదని విమర్శించారు.

మొండిగా ముందుకు వెళితే సీఎం జగన్ ఇంటి ముందే ఉద్యమిస్తాం అన్న పవన్
వారికి ముందు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. భయపెట్టి, బెదిరించాలి అనుకుంటే ప్రజలు భయపడరని హెచ్చరించారు. వారు ఖాళీ చేయడం తప్పనిసరి అని భావిస్తే వారికి ముందు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొండిగా ముందుకు వెళితే జనసేన తరపున సీఎం నివాసం వద్ద ఉద్యమిస్తామని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. భద్రత పేరుతో బెదిరిస్తారా .. ఆడపిల్లలను పచ్చి బూతులు తిడతారా అంటూ ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏపీ సర్కార్ పై ప్రజా సమస్యలపై పోరాటానికి జనసేన సిద్ధంగా ఉందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications