భానుడి "లాక్ డౌన్", పిట్టల్లా రాలుతున్నారు - రుతుపవనాల రాక ఎప్పుడంటే..!!
తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో నమోదౌతోన్న ఉష్ణోగ్రతలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బకు ఒకే రోజు పది మంది ప్రాణాలు కోల్పోయారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా రికార్డు అవుతోంది. రాత్రి 8 గంటలు దాటినా 39 డిగ్రీల వరకు ఉంటోంది. తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 50 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. మరో వైపు రుతుపవనాల కదలికలపైన ఐఎండీ కీలక సమాచారం ఇచ్చింది.
రికార్డు ఉష్ణోగ్రతలు:రికార్డు స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతల వేళ వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీలో మంగళవారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ మినహా మిగిలిన కోస్తా జిల్లాల్లు అన్నింటా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైకి చేరాయి. కొత్తి ప్రాంతాల్లో ఉదయం 10 గంటలకే గరిష్ణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైగా నమోదలైంది. బుధవారం కూడా రాష్ట్రంలో గరిష్ఠంగా 45 డిగ్గీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. 40 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. వడ దెబ్బ కారణంగా పలు ప్రాంతాల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు.

వడదెబ్బకు కన్నుమూత:తెలంగాణలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44, 45 డిగ్రీలను దాటాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు రోజులుగా 44 డిగ్రీలు నమోదయిన ఉష్ణోగ్రత మంగళవారం 45.4 డిగ్రీలకు చేరింది. సూర్యాపేట జిల్లా లక్కవరంలో గరిష్ఠంగా 45.4 డిగ్రీలు, మునగాల మండలంలో 44.4 డిగ్రీలు నమోదయ్యింది. నల్లగొండ జిల్లా దామరచర్లలో 45.1 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 44.8, జూలూరుపాడులో 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధిర, భద్రాచలంలలో 44 డిగ్రీలు నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే... మూడు కేంద్రాల్లో 45 డిగ్రీలు దాటగా, ఏడుచోట్ల 44 డిగ్రీలకు పైగా నమోదయ్యింది. 23 చోట్ల 43 డిగ్రీలకు పైగా నమోదయ్యింది. 18 చోట్ల 42 డిగ్రీలకు పైగా నమోదయ్యింది.
బయటకు రావద్దంటూ:ఇదే సమయంలో రుతుపవనాల రాక పైన ఐఎండీ ప్రకటన చేసింది. గత ఏడాది మే 28న రుతుపవనాల రాక ప్రారంభం అయింది. ప్రతీ ఏటా జూన్ 4వ తేదీ సమయానికి రుతుపవనాలు ప్రారంభం అవుతాయి, కానీ, ఈ సారి రుతుపవనాల రాక మరింత ఆలస్యం అవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. అదే సమయంలో ఈ సారి వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు, వడగాల్పులు మరో వారం పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోందని హెచ్చరించింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలతో వెళ్లాలని..అదే విధంగా ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఎండ సమయంలో ఇళ్లకే పరిమితం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications