ఏపీఎస్ఆర్టీసీ.. సౌతిండియా టూర్ ప్యాకేజీ: అరుణాచలం సహా అన్నీ కవర్..!!
APSRTC: గురు పౌర్ణమిని పురస్కరించుకుని తమిళనాడులో గల ప్రఖ్యాత శైవక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యం కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా ప్యాకేజీ టూర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి- ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం అని పేరు పెట్టింది.
జులై 8, 20 తేదీల్లో ఈ ప్రత్యేక బస్సులు అరుణాచలం యాత్రకు బయలుదేరి వెళ్లనున్నాయి. మొత్తం రెండు ప్యాకేజీ టూర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటికీ ప్రత్యేక ఛార్జీ, రూట్ మ్యాప్ వేర్వేరుగా నిర్ధారించారు ఆర్టీసీ అధికారులు.

అరుణాచలం యాత్రకు జులై 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి నుంచి బస్సులు బయలుదేరి వెళ్లనున్నాయి. అదే నెల 10వ తేదీన గురుపౌర్ణమి నాటికి అరుణాచలానికి చేరుకుంటాయి. ఈ యాత్రలో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ను భక్తులు దర్శించుకోవచ్చు.
గురు పౌర్ణమి నాడు అరుణాచలం గిరి ప్రదక్షిణ అనంతరం ఈ బస్సులు రాజమండ్రికి తిరుగముఖం పడతాయి. తిరుగుప్రయాణంలో కాంచీపురంలో వెలిసిన కంచి కామాక్షి అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుడి ఆలయాలను దర్శించుకునే వెసలుబాటు ఉంది. ఈ ప్యాకేజీ ఛార్జీ 5,200 రూపాయలు. ఆర్టీసీ భోజన సదుపాయాన్ని కల్పిస్తుంది.
అరుణాచలం- రామేశ్వరం యాత్ర తొమ్మిది రోజుల పాటు సాగుతుంది. దక్షిణాదిన గల ప్రఖ్యాత ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. జులై 20వ తేదీన రాజమండ్రి నుంచి బయలుదేరే బస్సు తొలుత కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి చేరుకుంటుంది.
అక్కడి నుంచి శ్రీపురం- గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, పళని- సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. కోయంబత్తూర్, ఊటీ, మైసూర్ ప్యాలెస్, గురువాయూర్ ఆలయం, తిరువనంతపురం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, తంజావూరును దర్శించవచ్చు. దీనికి ఛార్జీ 11,300 రూపాయలు.












Click it and Unblock the Notifications