APSRTC: ఏపీలో 23 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనలు-రీజన్ ఇదే..!
ఏపీ సర్కార్ పై ఆర్టీసీ ఉద్యోగులు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా ఈ నెల 23 నుంచి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ ఎలా నిరసనలు తెలియజేస్తారో కూడా వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
రాష్ట్రంలో ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులపై జిఓ విడుదల జాప్యం పట్ల పిటిడీ (ప్రజారవాణాశాఖ) ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 23 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభిస్తామని ఈయూ నేతలు ప్రకటించారు. ఆర్టీసి లో 129 డిపోలు, 4 వర్క్‌షాపుల వద్ద ఎర్రబ్యాడ్జీలు ధరించి ధర్నాలు చేపడతామన్నారు. ఆర్టీసీ విలీనం తరువాత 6 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారని వారు తెలిపారు.

పదోన్నతులు లభించక 2000 మంది ఆర్టీసి ఉద్యోగులు రిటైర్ అయి ఆర్ధిక నష్టం చవిచూశారని ఈయూ నేతలు తెలిపారు.
ముఖ్యమంత్రి ఆగస్టు 28నే అనుమతులు ఇచ్చినా జీఏడీలో అధికారుల జాప్యం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుమారు 6000 మంది అర్హులైన సిబ్బందికి పదోన్నతులు జాప్యం తో నష్టం జరుగుతుందన్నారు. ఈనెల 23 నుండి ఆందోళనలతో ప్రారంభమవుతుందని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతుల జిఓ విడుదల తక్షణమే చేయాలని వారు కోరారు.

ఇప్పటికే ఆర్టీసీలో పదోన్నతులతో పాటు పలు డిమాండ్లపై ఉద్యోగులు ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు కారణంగా తలెత్తుతున్న సమస్యల పరిష్కారంతో పాటు కొత్త బస్సుల కొనుగోలు వంటి అంశాలపై ప్రభుత్వం వేగంగా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో ఉద్యోగుల ప్రమోషన్ల వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్వయంగా స్పందించి ఆదేశాలు ఇచ్చినా అధికారులు అమలు చేయకపోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications