ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ సంక్రాంతి తీపి కబురు
APSRTC: వేలాదిమంది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. సంక్రాంతి పండగ సందర్భంగా శుభవార్త ఇచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు అయ్యేలా కొత్త వేతనాలను వారికి చెల్లించనుంది.
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కారించే దిశగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జీతాలతో పాటు అలవెన్స్‌లను కలిపి చెల్లిస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైమ్ అలవెన్సులను అప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తోంది ప్రభుత్వం.

ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల అలవెన్సుల చెల్లింపులో జాప్యం ఏర్పడుతూ వచ్చింది. 2017 నాటీ పేరివిజన్ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్‌కు చెల్లించాల్సిన మొత్తాలను విడుదల చేయడంలో ఆలస్యం చోటు చేసుకుంది. వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాలంటూ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలను జారీ చేసింది.
తాజాగా నైట్ హాల్ట్ అలవెన్సులను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఫిబ్రవరి 1వ తేదీన అందే వేతనంలో నైట్ హాల్ట్ అలవెన్సులను కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి.
ఫిబ్రవరి 1వ తేదీన వేతన మొత్తంలో కలిపి నైట్ హాల్ట్ అలవెన్సులను కూడా చెల్లిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చినట్లు ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు స్వాగతిస్తోన్నారు.












Click it and Unblock the Notifications