ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా..! పరిధిపై మాత్రం..?
ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీ అయిన ఉచిత బసు ప్రయాణం త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ దీని అమలుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా బస్సుల్లో ఎక్కే మహిళా ప్రయాణికులకు టికెట్ల జారీతో పాటు ఇతర అంశాల్ని ఖరారు చేసింది. వీటి వివరాలు ఓసారి పరిశీలిద్దాం..
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని సీఎం చంద్రబాబు ఆగస్టు 15న ప్రారంభించగానే ఆర్టీసీ కూడా దీన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బస్సుల్లో ఎక్కే మహిళలకు మాత్రం జీరో టికెట్ జారీ చేయబోతున్నారు. అంటే టికెట్ ఇస్తారు కానీ డబ్బులు తీసుకోరు. ఇది కూడా ఆర్టీసీ ఈ టికెట్ల వివరాలు ప్రభుత్వానికి సమర్పించి దానికి అయిన ఖర్చు రీయింబర్స్ మెంట్ చేసుకునేందుకు మాత్రమే.

మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పరిధిపై మాత్రం ప్రభుత్వం సస్పెన్స్ కొనసాగిస్తోంది. గతంలో అసెంబ్లీలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పిన దాని ప్రకారం అయితే ప్రస్తుతానికి ఈ పథకాన్ని జిల్లాల వరకే అనుమతిస్తారు. అంటే ఏ జిల్లా పరిధిలో ఉన్న వారు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం చేసేందుకు వీలు ఉంటుంది. అలా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనుమతిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా ఎన్నిసార్లు అయినా ప్రయాణం చేయవచ్చు. దీనిపై ప్రభుత్వం త్వరలో క్లారిటీ ఇవ్వబోతోంది.
అటు రాష్ట్రంలో ఆర్టీసీ టికెట్ల జారీ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.3708 కోట్లు వస్తుంటే అందులో 40 శాతం మహిళల ప్రయాణాల ద్వారా రూ.1483 కోట్లు వస్తున్నట్లు అంచనా. ఈ పథకం అమలు చేస్తే మహిళలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారని, దీంతో మొత్తం రాబడి రూ.5051 కోట్లకు చేరుతుందని, అందులో మహిళల వాటా రూ.3182 కోట్లు ఉంటుందని అంచనా. కాబట్టి దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఈ పథకం అమలుకు విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది. ఈ పథకం అమలైతే రోజుకు రాష్ట్రవ్యాప్తంగా అదనంగా మరో 11 లక్షల మంది మహిళలు ప్రయాణాలు చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications