దసరా పండుగ వేళ తిరుపతి, బెంగళూరు, చెన్నైకి ప్రత్యేక బస్సులు..!!
దసరా వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం అయ్యాయి. విద్య సంస్థలకు సెలవులు ఇవ్వటంతో ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. సొంత ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. అదే విధంగా ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారితో రైళ్లు.. బస్సులు రద్దీగా మారాయి. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా ఇప్పటికే ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సర్వీసులను పలు ప్రాంతాలకు ప్రకటించాయి. కాగా.. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి, చెన్నై, బెంగళూరుతో పాటుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ప్రకటించింది.
దసరా రద్దీ వేళ ఏపీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. రద్దీ మార్గాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తూ.. వివరాలు వెల్లడించింది. రద్దీని అంచనా వేసి 5,261 ప్రత్యేక సర్వీసుల్ని నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. పండుగ నేపథ్యంలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఈ నెల 16 నుంచి 19 వరకూ 3,207 బస్సులు సిద్ధం చేసినట్టు తెలిపారు. పండుగ తర్వాత తిరిగి వెళ్లే ప్రయాణీకుల కోసం అక్టోబరు 20 నుంచి 25 వరకూ 2,054 బస్సులు అందుబాటులో ఉంటాయని, ప్రయాణీకుల రద్దీని బట్టి ప్రయాణ సేవల్లో అంతరాయం ఏర్పడకుండా బస్సులు నడుపుతామని వెల్లడించారు. సాధారణ చార్జీలతో నడిపే ప్రత్యేక సర్వీసుల్లో అత్యధికంగా హైదరాబాద్ నుంచి మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 1,186 బస్సులు కేటాయించామని వెల్లడించారు.

రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు
అదే విధంగా విజయవాడకు 1,053, బెంగుళూరుకు 475, చెన్నైకి 153, విశాఖపట్నానికి 440, రాజమండ్రికి 347, తిరుపతికి 247బస్సులు నడుపుతున్నట్టు వివరించారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. వరుస సెలవులతో రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే రెగ్యులర్ రైళ్లు.. బస్సులు ఫుల్ అవుతున్నాయి. దీంతో.. తిరుపతికి ప్రత్యేకంగా బస్సులను కేటాయించినట్లు వివరించారు. ఆర్టీసీ సేవల్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఆర్టీసీలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. మరో మూడు నెలల్లో 150 బస్సులు రాబోతున్నాయని, ఆర్టీసీ సొంతంగా 500 సీఎన్జీ బస్సులు వచ్చే ఏడాది మే నాటికి కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. మరో 1,450 అదే ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.












Click it and Unblock the Notifications
