సంక్రాంతికి ఆర్టీసీ బస్సులెక్కువ -ఛార్జీలు తక్కువ- రాయితీలివే..!
ఈసారి సంక్రాంతికి ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గతంతో పోలిస్తే ఎన్నో మార్పులతో ఈసారి సంక్రాంతికి స్వాగతం పలికేందుకు ఆర్టీసీ సిద్దమైంది. గతంలో అదనపు ఛార్జీలతో సంక్రాంతి ప్రయాణికులను చికాకుపెట్టిన చరిత్ర ఉన్న ఆర్టీసీ.. ఈసారి మాత్రం సాధారణ ఛార్జీలతోనే ఆర్టీసీ రద్దీని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైంది. దీంతో భారీ సంఖ్యలో సంక్రాంతి స్పెషల్ బస్సుల్ని అందుబాటులోకి తేవడంతో పాటు పలు రాయితీలు ఇస్తోంది.

సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు ఈసారి ఏకంగా 7200 ప్రత్యేక బస్సుల్ని నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడుకు వెళ్లే సర్వీసులు కూడా ఉన్నాయి. సంక్రాంతి నేపథ్యంలో స్వస్థలాలకు వచ్చే వారికి, అలాగే పండుగ తర్వాత తిరిగి వెళ్లే వారికి అనుకూలంగా ఉండేలా ఈ అదనపు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. జనవరి 8 నుంచి జనవరి 13 వరకూ ఈ ప్రత్యేక సర్వీసుల్ని అందుబాటులో ఉంచుతోంది.
ఏపీఎస్ ఆర్టీసీ నడుపుతున్న 7200 ప్రత్యేక బస్సుల్లో 2153 కేవలం హైదరాబాద్ నుంచే ఉన్నాయి. అలాగే బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 బస్సులు ఉన్నాయి. మిగిలిన సర్వీసులు ఇతర ప్రాంతాల నుంచి నడపనున్నారు. అలాగే ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ సంక్రాంతి ప్రయాణికులు తిరిగి వెళ్లేందుకు వీలుగా 3200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటిలో అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని చెప్పారు.
మరోవైపు సంక్రాంతి స్పెషల్ గా పలు ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. రెండువైపులా ప్రయాణాలకు టికెట్లు ముందుగానే బుక్ చేసుకుంటే మొత్తం ఛార్జీలో 10 శాతం రాయితీ ఇస్తామని ఆర్టీసీ ప్రకటించింది. వీటి కోసం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. తద్వారా సంక్రాంతికి ఎక్కువ మంది తమ బస్సుల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తోంది. గతంతో పోలిస్తే భారీ సంఖ్యలో అదనపు బస్సులు నడుపుతుండటంతో ఆ మేరకు ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరబోతోంది.












Click it and Unblock the Notifications