APSRTC : వైజాగ్ నుంచి ఒడిశాకు 7 అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు-టైమింగ్స్ ఇవే...!
ఏపీ నుంచి పొరుగు రాష్ట్రమైన ఒడిశాకు కొత్తగా అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఒకటీ అరా సర్వీసులు ఉండగా.. వాటి స్ధానంలో రెగ్యులర్ గా రాకపోకలు సాగించేలా కొత్త సర్వీసుల్ని ఏపీఎస్ఆర్టీసీ ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి ఒడిశా మధ్య రాకపోకలు సాగించే ఏడు అంతర్ రాష్ట్ర సర్వీసుల్ని, వాటి సమయాల్ని స్టాపుల్ని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
ఏపీ నుంచి ఒడిశా మధ్య నడిచే ఏడు అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలి బస్సు ఇవాళ ఉదయం విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం, సాలూరు మీదుగా ఒడిశాలోని జైపూర్ కు బయలుదేరింది. ఈ బస్సు రాత్రి 8 గంటలకు జైపూర్ చేరుకోనుంది. రెండో సర్వీసు విశాఖ నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి విజయనగరం, సాలూరు మీదుగా మరుసటి రోజు ఉదయం 5 గంటలకు నవరంగ్ పూర్ చేరుకోనుంది. మూడో సర్వీసు విశాఖపట్నంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి ఎస్.కోట, అరకు మీదుగా మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఒనకఢిల్లీ చేరుకోనుంది.

నాలుగో సర్వీసు విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం, పాతపట్నం మీదుగా పర్లాకిమిడికి మధ్యాహ్నం 3.15 గంటలకు చేరుకోనుంది. ఐదో సర్వీసు విశాఖలోని కూర్మన్నపాలెం నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం, పర్లాకిమిడి మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు గుణుపూర్ చేరుకోనుంది. ఆరో సర్వీసు విశాఖపట్నంలోని సింహాచలం నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు బయలుదేరి రాజాం, పాలకొండ, కొత్తూరు, హడ్డుబంగి మీదుగా గుణుపూర్ కు తర్వాతి రోజు ఉదయం 4 గంటలకు చేరుకోనుంది. ఏడో సర్వీస్ విశాఖలో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి విజయనగరం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం మీదుగా గుణుపూర్ కు తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు చేరుకోనుంది.
ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఈ అంతర్ రాష్ట్ర సర్వీసుల్ని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ బస్సుల్లో టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. కోవిడ్ తర్వాత తిరిగి పుంజుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పొరుగు రాష్ట్రాలకు అంతర్ రాష్ట్ర సర్వీసుల్ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications