తాకట్టులో బెజవాడ బెర్మ్ పార్కు - రూ.143 కోట్ల రుణం : తనఖా ప్రక్రియలో ఆసక్తికర అంశాలు..!!
కొద్ది రోజుల క్రితం వరకు రాష్ట్రంలో పలు భవనాలు...స్థలాలు తనఖాలు పెట్టిన పరిస్థితి ఎదురైంది. ఇక, ఇప్పుడు పార్కులు సైతం తనఖా పెడుతున్నారు. తాజాగా.. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బెజవాడలోని ప్రధాన పార్కు ను తనఖా పెట్టింది. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉండే భారీ విలువ ఉన్న బెర్మ్ పార్కును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తనఖా పెట్టారు. పలు అభివృద్ధి పనుల పేరుతో రూ 143 కోట్ల మేర రుణం తీసుకుంటోంది. వియవాడలో దాదాపుగా అయిదు ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కు ఉంది. నిత్యం వందలాది మంది బోట్లలో భవానీ ద్వీపానికి వెళ్లి వస్తుంటారు.

భారీ విలువ ఉన్న పార్కు
బెర్మ్ పార్కును ఆనుకొని బోటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం పార్కు ప్రాంగణంలో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో హోటల్ నిర్వహిస్తున్నారు. ఇందులో 30 వరకు గదులున్నాయి. పెద్ద సమావేశ హాలు ఉంది. సమావేశాలకు, శుభకార్యాలకు దీన్ని అద్దెకు ఇస్తుంటారు. తనఖా సమయంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పలు కీలక అంశాలను ప్రస్తావించింది.
దీని ద్వారా పొందే రుణంతో పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడంతో పాటు హోటళ్లు, రిసార్టులను ఆధునికీకరిస్తామని బ్యాంకుకు ఏపీటీడీసీ తెలిపింది. విజయవాడలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కు పలు ఆస్తులు ఉన్నాయి. కానీ, ఎంతో విలువ ఉన్న బెర్మ్ పార్కు వైపే బ్యాంకు మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు.

పలు ప్రతిపాదనలతో రుణం
ఇక, ఈ రుణం కోసం ఏపీటీడీసీ పలు ప్రతిపాదనలు బ్యాంకుకు అందించింది. అందులో భాగంగా... మొత్తం 9 పెండింగు ప్రాజెక్టులకు ఇప్పటివరకు రూ.8.74 కోట్ల వ్యయం కాగా, ఇంకా రూ.41.70 కోట్లు అవసరం. హోటళ్లు, రిసార్టుల ఆధునికీకరణ పనులు 17 ఉండగా వాటికి ఇప్పటివరకు రూ.3.62 కోట్ల వ్యయమైంది. మరో రూ.55.82 కోట్లు అవసరం.
ఇలా మొత్తం రూ.97.52 కోట్ల పనులకు ప్రతిపాదించినట్లు సమాచారం. పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధీనంలోని హోటళ్లు, రెస్టారెంట్ల ఆధునికీకరణ ప్రతిపాదనలు నిధుల కొరత కారణంగా ముందుకు కదల్లేదు. వీటిని పూర్తి చేయటానికి నిధులు అవసరం. ఇందు కోసం వీటిని పూర్తి చేయడానికి బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఏపీటీడీసీ రెండు, మూడు బ్యాంకులను సంప్రదించి, చివరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు బెర్మ్ పార్కును రూ.143 కోట్ల రుణం కోసం తనఖా పెట్టింది.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే
ఇప్పటికే చేసిన వర్క్స్ కు సంబంధించే దాదాపుగా రూ 10 కోట్లకు పైగా పెండింగ్ బిల్స్ చెల్లించాల్సి ఉన్నట్లుగా తెలుసస్తోంది. దీని కారణంగా ఇతర పనుల నిర్వహణ కోసం కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ప్రారంభించిన అనేక ప్రాజెక్టుల పనులు ఫండ్స్ లేక మధ్యలోనే నిలిచిపోయాయి.
వాటిలో ఇడుపులపాయలో రాజీవ్ నాలెడ్జి వ్యాలీ, లంబసింగి, బొర్రా గుహలు, అహోబిలంలో పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పన, గండికోట, కోటప్పకొండ వద్ద తీగ మార్గం (రోప్‌వే) వంటివి ఉన్నాయి. పనులను పూర్తి చేయటం కోసమే.. రుణం తీసుకుంటున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ రూ 143 కోట్ల రుణంలో భాగంగా తొలి విడతలో రూ 35 కోట్లు మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు బెర్మ్ పార్కు తాకట్లు నిర్ణయం పైన ప్రతిపక్షాల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications