వైసీపీకి మరో షాక్- అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు..!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్ష వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి క్షేత్రస్దాయిలో ఉన్న నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా కూటమివైపు చూస్తుంటే.. మరోవైపు ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారికి సైతం సమస్యలు తప్పడం లేదు. ఇదే క్రమంలో అరకు వైసీపీ ఎంపీ గుమ్మ తనూజారాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొత్తపల్లి గీత దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నోటీసులు ఇచ్చింది.
గత లోక్ సభ ఎన్నికల్లో అరకు లోక్ సభ సీటు నుంచి వైసీపీ అభ్యర్దిగా గుమ్మ తనూజారాణి తొలిసారి బరిలోకి దిగారు. అలాగే మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఆమెకు ప్రత్యర్ధిగా బరిలోకి దిగారు. అయితే ఈ ఎన్నికల్లో తనూజారాణి 50580 ఓట్ల తేడాతో కొత్తపల్లి గీతను ఓడించారు. అయితే ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అసలు తనూజారాణి ఎన్నికల అఫిడవిట్ లోనే తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తనూజారాణితో పాటు ఎన్నికల అధికారులకూ నోటీసులు పంపింది.

గుమ్మ తనూజారాణి ఎన్నికల అఫిడవిట్ లో వాస్తవాలు చెప్పలేదని, దీనిపై తాను రిటర్నింగ్ అధికారిని ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆరోపిస్తూ కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఎన్నికల అధికారులకూ, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు ఇతర అభ్యర్ధులకు సైతం హైకోర్టులో నోటీసులు పంపింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఆలోపు సమాధానం ఇవ్వాలని వీరిని ఆదేశించింది. అరకు ఎంపీగా తొలిసారి ఎన్నికైన తనూజారాణి తరహాలోనే గతంలో కొత్తపల్లి గీత కూడా మొదటిసారి ఎన్నికైనప్పుడు పలు వివాదాలు ఎదుర్కొన్నారు.












Click it and Unblock the Notifications