ఎండ భరించలేక ఏసీలు వాడుతున్నారా? కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఈ చిట్కాలు పాటించండి!!
మే నెలలో విపరీతమైన ఎండలు రెండు తెలుగు రాష్ట్రాలలో నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఒక గంట సేపు బయటికి వెళితే చెమటతో, ఉక్కపోతతో భరించలేని పరిస్థితి ఉంటుంది. ఎండ తీవ్రతను తట్టుకోలేని వారందరూ ఇంట్లో ఏసీల ముందు, కూలర్ల ముందు కూర్చుని సేద తీరుతున్నారు.
కంటిన్యూగా ఏసీలు, కూలర్లు వాడడం వల్ల కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని తెగ బాధపడుతున్నారు. కానీ విధి లేని పరిస్థితుల్లో ఏసీల వాడకం మాత్రం తప్పడం లేదు. అయితే ఎండల దెబ్బకు ఏసీ ఉపయోగించినప్పటికీ, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ కరెంటు బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.

చలికాలం ఏసీని ఉపయోగించని వారు, ఎండాకాలం రాగానే ఏసీ లను ఆన్ చేస్తారు. అయితే ఏసీలను ఉపయోగించే ముందు ఒకసారి కచ్చితంగా వాటిని సర్వీసింగ్ చేయించాలి. మరీ 10 సంవత్సరాలు దాటిన పాత ఏసీలు అయితే కరెంటు బిల్లులు కూడా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏసీ మెకానిక్ ల తో ఒక సారి ఏసీ లను చెక్ చేయించి వారి సలహా మేరకు ఉపయోగించుకోవడం మంచిది.
ఇక ఎండలో చల్లదనం కోసం చాలామంది 16 డిగ్రీల సెల్సియస్ వద్ద ఏసీ ని రన్ చేస్తూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల కంప్రెషర్ పనిచేయడానికి అదనంగా కరెంటు ఉపయోగించుకుంటుంది. దీనివల్ల కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది. అందుకే ఏసీలను ఎప్పుడూ 24 డిగ్రీలు, 25 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే రన్ చేయాలి.
అంతేకాదు ఆటో మోడ్ ఉపయోగించినప్పుడు, గది చల్లబడగానే కంప్రెషర్ దానికదే ఆఫ్ అవుతుంది. అప్పుడే కరెంట్ బిల్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గది మనకు కావలసిన మేరకు మాత్రమే చల్లబడుతుంది. ఇక ఏసిలను ఉపయోగించేవారు తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏసీ పెట్టినటువంటి గదికి ప్రత్యక్ష సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి.
అప్పుడే ఆ గది త్వరగా చల్లబడడానికి వీలుంటుంది. గది నేరుగా సూర్యరశ్మికి గురి అయితే చల్లబడడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఏసీ ఫిట్ చేసుకునే గది ఎప్పుడు నేరుగా ఎండ తగిలే విధంగా ఉండకూడదు. ముఖ్యంగా ఏసీల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే విపరీతమైన కరెంటు బిల్లుల బాదుడు నుండి ఉపశమనం పొందొచ్చు.












Click it and Unblock the Notifications