చంద్రబాబుకు కేజ్రివాల్ లేఖ-ఆలోచించుకోండి..!
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇవాళ ఓ లేఖ రాశారు. పార్లమెంట్ లో నిన్న, ఇవాళ చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రానికి మద్దతుపై పునరాలోచన చేయాలని కోరుతూ కేజ్రివాల్ ఈ లేఖ రాశారు. ఇందులో పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబుకు గుర్తుచేశారు.
రాజ్యాంగంతో పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి తన ఆందోళనలు పంచుకునేందుకు ఈ లేఖ రాస్తున్నట్లు కేజ్రివాల్ తెలిపారు. అంబేద్కర్ నినాదం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశాన్ని షాక్ కు గురి చేశాయని కేజ్రివాల్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు అంబేద్కర్ పైనా, రాజ్యాంగంపైనా బీజేపీకి ఉన్న అభిప్రాయాన్ని తెలిపేలా ఉన్నాయన్నారు. అమిత్ షా తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరాల్సింది పోయి సమర్ధించుకున్నాయని, ప్రధాని మోడీ సైతం ఆయన్ను వెనకేసుకు వస్తున్నారని కేజ్రివాల్ గుర్తుచేశారు.

అమిత్ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని, ఇకపై అంబేద్కర్ ను అభిమానించే వారు బీజేపీకి ఓటు వేయరని కేజ్రివాల్ తెలిపారు. అంబేద్కర్ కేవలం నాయకుడు కాదని ఆయన మన జాతి ఆత్మ అన్నారు. కాబట్టి ఈ విషయంపై మీరు తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చంద్రబాబుకు కేజ్రివాల్ తెలిపారు.













Click it and Unblock the Notifications