తెలుగుదేశం పార్టీ నాయకునిపై హత్యాయత్నం
కాకినాడ జిల్లా తునిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషంలో వచ్చిన దుండగుడు భిక్ష అడిగాడు. తర్వాత ఆ భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి శేషగిరిరావుపై తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. ఈ ఘటనలో శేషగిరిరావు చేతికి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు శేషగిరిరావును కాకినాడలో అపోలో ఆస్పత్రికి తరలించారు. దాడిచేసిన అనంతరం నిందితుడు ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు.
సమాచారం అందుకున్న తుని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ సీనియర్ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు తదితర నాయకులు ఆస్పత్రికి వెళ్లారు. శేషగిరిరావు ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. దాడికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేశారు. శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగిన విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అవసరమైన వైద్య సహాయంలో ఎటువంటి లోటు లేకుండా చూడాలని తూర్పుగోదావరి జిల్లా నాయకులకు సూచించారు.

పొల్నాటి శేషగిరిరావుకు ఎవరైనా శత్రువులున్నారా? ఇటీవలి కాలంలో ఆయన పాల్గొన్న కార్యక్రమాలు, జరిగిన సంఘటనలు తదితర వివరాలను కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత కోణంలో హత్య జరిగిందా? పార్టీ కోణంలో హత్య జరిగిందా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications