అసైన్డ్ భూములపై జగన్ సంచలనం -వ్యవసాయ భూమికంటే 10శాతం ఎక్కువ పరిహారం -దేశంలో తొలిసారి ఏపీలోనే
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 'అసైన్డ్ భూములు' వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా దేవరయాజల్ లో అసైన్డ్ భూములు కబ్జా చేశారనే ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోయిన ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ నుంచి కూడా బహిష్కరించే ప్రక్రియ జోరందుకుంది. ఏపీలో మాత్రం అసైన్డ్ భూములకు పరిహారాన్ని పదింతలు చేస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

సాగు భూమికంటే 10శాతం ఎక్కువ..
ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ఎక్కడైనా తప్పనిసరిగా భూ సేకరణ చేయాల్సిన పరిస్థితులు వస్తే.. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములకు భారీ ఎత్తున పరిహారం చెల్లించనున్నారు. సాగుభూములుగా రైత్వారీ పట్టా కలిగిన భూముల కంటే 10 శాతం అదనంగా అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. అసైన్డ్ భూములంటే ప్రభుత్వం అత్తగారి ఆస్తిలా భావించరాదని, ఎస్సీ ఎస్టీలకు పప్పు బెల్లాలు కొద్ది మొత్తం పరిహారం ఇచ్చి గుంజుకోవడం లాంటివి భవిష్యత్తులో జరగకుండా పేదలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయానికి కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది.

వైఎస్ స్ఫూర్తి, జాతీయ చట్టం కంటే మెరుగ్గా..
అసైన్డ్ భూముల విషయంలో జాతీయ భూ సేకరణ చట్టం-2013లో పేర్కొన్న దానికంటే అధికంగా పరిహారం చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రైత్వారీ భూములతో సమానంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని 2013నాటి జాతీయ భూసేకరణ చట్టం చెబుతుండగా, ఇప్పుడు ఏపీ సర్కారు నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు రైత్వారీ పట్టాల కంటే 10 శాతం అధికంగా పరిహారం దక్కుతుంది. నిజానికి ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాలని దివంగత సీఎం వైఎస్సార్ 2007లోనే నిర్ణయించారని, ఆ స్ఫూర్తితోనే 2013 'జాతీయ భూసేకరణ చట్టం' వచ్చిందని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.

దేశంలోనే తొలిసారి ఏపీలో..
అసైన్డ భూములకు రైత్వారీ పట్టాలు కలిగిన భూముల కంటే10 శాతం అదనంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పింది. ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు అతి తక్కువ పరిహారం ఇచ్చి వేలాది ఎకరాలు గుంజుకున్నారని, రాజధాని అమరావతి కోసం లోపభూయీష్టమైన భూ సమీకరణ విధానాన్ని టీడీపీ అమలు చేసిందని, ల్యాండ్ పూలింగ్ విధానానికి జాతీయ భూ సేకరణ చట్టం వర్తించదని వక్ర భాష్యం చెప్పారని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications