వైఎస్ జగన్ భవితవ్యం ఏమిటో తేల్చేసిన జ్యోతిష్కుడు
అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు కూడా మొదలు పెట్టనుంది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాల లేకపోలేదనే ప్రచారం ఊపందుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశంపై తెరమీదికి వచ్చింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అసెంబ్లీని రద్దు చేయాలనే యోచనలో వైఎస్ జగన్ ఉన్నారని తెలుస్తోంది. నిజానికి- షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది సార్వత్రికంతో పాటే ఏపీ అసెంబ్లీకీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. దీనికి భిన్నంగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చని చెబుతున్నారు.

అటు వైఎస్ జగన్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోన్నారు. వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగనున్నారు. దీనికోసం సన్నాహాలు మొదలు పెట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో జనంలోకి వెళ్లారు. గ్రామస్థాయిలో వైఎస్ఆర్సీపీ శాసన సభ్యులు మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకూ ఇందులో పాల్గొన్నారు. జగనన్నే మన భవిష్యత్ పేరుతో ఇంటింటికీ స్టిక్కర్లను అతికించారు.

ఈ పరిణామాల మధ్య ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ ప్రతాప్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మరోసారి అధికారంలోకి రాబోయేది వైఎస్ జగనే అని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ సారథ్యంలో ఏపీలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేసినట్లు వివరించారు. పూర్తి కాలం పాటు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటారనీ స్పష్టం చేశారు. దీనిపై ఓ ట్వీట్ చేశారాయన.

గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని రుద్ర కరణ్ ప్రతాప్ అంచనా వేశారు. ఆయన అంచనాలకు తగ్గట్టే కర్ణాటక ఫలితాలు వెలువడ్డాయి. మే నెలలో బీజేపీకి అన్నీ చేదు అనుభవాలు ఎదురవుతాయని, ఆ పార్టీ ఎదురుదెబ్బలను చవి చూస్తుందంటూ హెచ్చరించారు. మే నెలలో షెడ్యూల్ అయిన ఎన్నికలు బీజేపీకి అరిష్ఠాన్ని తెచ్చిపెడతాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 29వ తేదీన ఓ ట్వీట్ చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 122 నుంచి 133 సీట్లు లభిస్తాయంటూ ఏప్రిల్ 18వ తేదీన మరో ట్వీట్ చేశారాయన. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు ఆ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన అంచనా వేసినట్టే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 135 సీట్లను సాధించింది. ఇప్పుడు అదే రుద్ర కరణ్ ప్రతాప్.. ఏపీ రాజకీయాలపై తన అంచనాలను వెల్లడించడం ఆసక్తి రేపింది.












Click it and Unblock the Notifications