దొంగ ఓట్లతో గెలిచి సిగ్గు శరం లేకుండా సంబరాలు; అప్పుడు గెలిస్తే టీడీపీని మూసేస్తాం: అచ్చెన్నాయుడు సంచలనం
కుప్పం మున్సిపల్ ఎన్నికలలో వైసిపి సాధించిన గెలుపుపై వైసీపీ నేతలు సంబరాలు జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఉంటే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వైసిపి సాధించిన విజయం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో సాధించిన గెలుపు ఓ గెలుపేనా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన రోజు నుంచి అధికార పార్టీ కుప్పంలో ఏం చేసిందో ప్రజలందరూ చూశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

దొంగ ఓట్లతో గెలిచి సిగ్గు శరం లేకుండా సంబరాలు
కుప్పంలో గెలిచామని సీఎం జగన్, మంత్రులు జబ్బలు చరుచుకుని సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్లతో గెలిచి సిగ్గు శరం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా ఓ గెలుపేనా అంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. కుప్పంలో వైసీపీ ఏవిధంగా గెలిచిందో అందరికీ తెలుసని పేర్కొన్న అచ్చెన్నాయుడు వైసిపి కారణంగా అమాయకులైన మహిళలు చీర చెంగు అడ్డుపెట్టుకొని సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. అమాయకులైన మహిళలను పుంగనూరు, ఇతర నియోజకవర్గాల నుండి దొంగ ఓట్లు వేయడానికి తరలించారని అసహనం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు.

టీడీపీ ఓటమికి చేతగాని ఎన్నికల సంఘం కూడా ఒక కారణం
ఇక తెలుగుదేశం పార్టీ ఓటమికి చేతగాని ఎన్నికల సంఘం కూడా ఒక కారణమని అచ్చెన్న వ్యాఖ్యానించారు. కుప్పంలో వైసీపీ గెలుపును తాము అస్సలు లెక్క వేసుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని చంకలు గుద్దుకుంటున్న జగన్ సర్కార్ నిజంగా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని భావిస్తే తక్షణమే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైతే పార్టీని మూసేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ ఈ ఎన్నికల్లో పుంజుకుంది.. అందుకు పోలైన ఓట్లే నిదర్శనం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సొంత వార్డులో వైసిపి ఓటమి పాలైందని పేర్కొన్న ఆయన, దానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బేతంచర్ల లో తెలుగుదేశం పార్టీకి నాయకుడే లేకపోయినా ఆరు స్థానాలు గెలిచిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంది అని పేర్కొన్న అచ్చెన్నాయుడు ఏడు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 30 శాతం ఓట్లు వచ్చాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని, కానీ ప్రస్తుతం జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 46 శాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు.

టీడీపీకి ప్రజల్లో ప్రాధాన్యత ఉంది, అక్కడ మీ సంక్షేమం పని చెయ్యలేదేం
తెలుగుదేశం పార్టీకి నమోదైన ఓట్లను, వైసిపికి వేసిన ఓట్లను చూస్తే, 49 శాతం వైసిపికి వస్తే 46 శాతం టీడీపీకి వచ్చాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనిని బట్టి టీడీపీకి ప్రజల్లో ప్రాధాన్యత పెరిగింది అన్నది అర్థమవుతుందన్నారు. గుంటూరు పట్టణంలో ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి 1280 ఓట్లతో గెలిస్తే ఇప్పుడు అదే స్థానం లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి 680 ఓట్ల తో గెలిచారని అచ్చెన్న స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గుంటూరు డివిజన్ లో పని చేయలేదా అంటూ ఎద్దేవా చేశారు.
Recommended Video

కుప్పంలో మీది ఒక గెలుపేనా ? టీడీపీ అలా చూడదు
దాచేపల్లిలో వైసీపీ 11 వార్డులలో గెలిస్తే టిడిపి 9 వార్డులలో గెలిచిందని పేర్కొన్నారు. టిడిపి గెలిచిన చోట్ల ఇప్పటికే చేయాల్సిన దారుణాలు చేస్తూనే ఉన్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అంతేకాదు ప్రజల సమస్యలపై చర్చించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కి ధైర్యం లేదని, ఒక రోజు అసెంబ్లీ పెట్టి ఏం సాధిస్తారు అంటూ అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి నిలదీశారు. 12 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగితే ఏడు మున్సిపాలిటీలలో కార్యకర్తలు హోరాహోరీగా పోరాడారని అచ్చెన్న పేర్కొన్నారు. ఐదు జిల్లాల్లో టిడిపి స్వీప్ చేసిందనేది వాస్తవమన్నారు అచ్చెన్నాయుడు. వైసిపి కుప్పం గెలుపు అని చెప్పుకుంటున్న దానిని తెలుగుదేశం పార్టీ విజయంగా చూడబోదని అచ్చెన్నాయుడు కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications