
ఆత్మకూరు ఫలితంతో కొత్త సమీకరణాలు - భారీ మెజార్టీ వెనుక : టీడీపీ ఓట్లు వైసీపీకేనా..!!
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా గెలుపు దక్కించుకుంది. అయినా..ఎన్నికల్లో పోలైన ఓట్లు..సమీకరణాలు మాత్రం ప్రధాన పార్టీలకు సూచనలు - హెచ్చరికలుగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నిల్లో వైసీపీ కి ప్రధాన ప్రత్యర్దిగా బీజేపీ నిలిచింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ - జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. గౌతమ్ రెడ్డి మరణంతో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీలో నిలిచారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా అభ్యర్ది గెలుపు కోసం మంత్రులు - ఇంఛార్జ్ లకు బాధ్యతలు కేటాయించారు. లక్ష మెజార్టీ లక్ష్యమని పదే పదే చెబుతూ వచ్చారు.

ఆత్మకూరులో ఎవరి బలం ఎంత
గౌతమ్ మరణం .. నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ఉన్న పట్టు..అభిమానం.. వైసీపీ కి ఉన్న ఆదరణ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి 1,02,240 ఓట్లు పోలవ్వగా..అందులో వైసీపికి 82,888 ఓట్లు మెజార్టీ దక్కింది. బీజేపీ అభ్యర్ధికి 19,352 ఓట్లు రాగా..మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్ధి 4,773 ఓట్లు దక్కించుకున్నారు. అయితే, అనూహ్యంగా నోటీ కు 3,972 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ తొలి రౌండ్ నుంచి ఏకపక్షంగా మెజార్టీ సాధించింది. గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఇది భారీగా ఉంది. తొలి సారి ఎన్నికల్లో పోటీ చేసిన విక్రమ్ రెడ్డి కొత్త రికార్డు క్రియేట్ చేసారు. అయితే, ఇక్కడ 2019 ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే..ఆ ఎన్నికల్లో వైసీపీకి 92758 ఓట్లు రాగా, టీడీపీకి 70482 దక్కాయి.

ఓట్లు - కొత్త సమీకరణాలు
నోటా కింద 2161 ఓట్లు పోలవ్వగా.. జనసేనకు 2089 ఓట్లు..బీజేపీకి గత ఎన్నికల్లో 2314 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు..టీడీపీ తో సహా ఇతర పార్టీలకు వేయలేని వాళ్లు బీజేపీకి వేసినట్లుగా స్పష్టం అవుతోంది. దీంతో..గత ఎన్నికల్లో 2314 ఓట్లు దక్కించుకున్న బీజేపీకి.. ఇప్పుడు 19,352 ఓట్లు వచ్చాయి. అయితే, ఇక్కడ 2019 ఎన్నికల్లో టీడీపీకి 70482 ఓట్లు వచ్చాయి. కానీ, గతంలో టీడీపీకి ఓట్లు వేసిన వారు సైతం ఇప్పుడు బీజేపీకి కాకుండా మెజార్టీ ఓట్లు వైసీపీకే పడినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా జనసేన ఓట్లు సైతం బీజేపీకి టర్న్ అయినట్లుగా కనిపిస్తోంది. టీడీపీ బరిలో లేకపోయినా.. వైసీపీ వ్యతిరేకంగా ఉన్న వారు బీజేపీకి పూర్తి స్థాయిలో సహకరించలేదనేది అర్దం అవుతోంది.

ఈ మార్పు ఇంత వరకేనా - భవిష్యత్ లోనూ..
అయితే, టీడీపీ పోటీలో ఉంటే తిరిగి 2019 ఎన్నికల తరహాలోనే ఆ పార్టీకే ఆ ఓట్లు డైవర్ట్ అవుతాయా.. లేక, వైసీపీకే వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగుతాయా అనేది మాత్రం ఆసక్తి కరంగా మారుతోంది. ఇక, నోటా ఓట్ల సంఖ్య ఒక బై పోల్ లో దాదాపుగా 3,972 రావటం అనేది పరిగణలోకీ తీసుకోవాల్సిన అంశంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లోనూ ఆత్మకూరులో 2161 ఓట్లు నోటా కింద నమోదయ్యాయి. ఇప్పుడు ఆత్మకూరులో టీడీపీ ఓటర్లు గౌతమ్ రెడ్డి మరణంతో సానుభూతి తో వైసీపీకి వేసారా.. లేక, వారంతా వైసీపీకి టర్న్ అయ్యారా అనేది కీలకంగా మారుతోంది. ఈ సమీకరణాల నేపథ్యంలో ఆత్మకూరు ఎన్నికల ఫలితాల పైన అధికార వైసీపీతో పాటుగా.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ - జనసేన కు కొత్త టెన్షన్ తెచ్చి పెడుతున్నాయి.