ఆ ఆరోపణలు నిరూపిస్తే ఇంట్లో కూర్చుంటా : వైసీపీ నేతలకు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సవాల్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెత్త పాలన చేసేవారిని చెత్తనా కొడుకులు అనక మరి ఏమంటారు అంటూ మండిపడ్డారు. జగన్ హయాంలో రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు పరిపాలన చేతగాని వారికి ఓట్లు వేస్తే ఎలా ఉంటుందో అర్థమైందని వ్యాఖ్యానించారు.
ప్రజలు దిక్కుమాలిన పార్టీకి ఓటేశామని ఇప్పుడు బాధ పడుతున్నారు
ప్రజలు దిక్కుమాలిన పార్టీకి ఓటేశామని రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ఇప్పుడు బాధ పడుతున్నారంటూ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం ఏమిటి ? విపరీతమైన దుబారా ఖర్చు ఏమిటి ? అంటూ ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడు గతంలో టిడిపి హయాంలో అభివృద్ధి చేస్తే జగన్ హయాంలో చేస్తున్న అప్పుల డబ్బులను ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏంటి? చేస్తున్నదేంటి అంటూ ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి 25 ఏళ్ల పాటు బ్రాందీ షాపులు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.

ఉత్తరాంధ్రను దోచుకుంటే వైసిపి ఎమ్మెల్యేలకు మాట్లాడే దమ్ము ఉందా?
విశాఖ భూములను తాకట్టు పెట్టారని, టూరిజం మంత్రికి తెలియకుండా టూరిజం రిసార్ట్స్ కూల్చేశారని అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను 25 వేల కోట్లకు తాకట్టు పెట్టారని అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. జగన్ పార్టీకి ఏ ప్రజలైతే అన్ని సీట్లు ఇచ్చి గెలిపించారో అదే ప్రజలు భవిష్యత్తులో కొట్టే పరిస్థితి వస్తుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.ఇక ఇటీవల హెటిరో డ్రగ్స్ లో దొరికిన డబ్బంతా జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన ఆరోపణలు గుప్పించారు. సీఎం జగన్ ఉత్తరాంధ్రను దోచుకుంటే వైసిపి ఎమ్మెల్యేలకు మాట్లాడే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడు జగన్ హయాంలో ఉత్తరాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని విమర్శించారు.
తనపై గంజాయి వ్యాపార ఆరోపణలు నిరూపిస్తే ఇంట్లో కూర్చుంటా ..అయ్యన్న సవాల్
తన 38 ఏళ్ల రాజకీయ జీవితంలో గంజాయి వ్యాపారంతో సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇంట్లో కూర్చుంటానని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు మీరు సిద్ధమా అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఆరోపణలు చేసేముందు వాస్తవాలు తెలుసుకుని వైసీపీ నేతలు మాట్లాడాలని టిడిపి నాయకుడు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారు అనేది పోలీసులకు తెలుసని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండటం కోసం యువతను మత్తుకు బానిసలను చేస్తున్నారంటూ మండిపడ్డారు. కావాలనే యువతను గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా చేస్తున్నారేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు అయ్యన్నపాత్రుడు.
ఏపీలో డ్రగ్స్ దుమారం .. వైసీపీ సర్కార్ టార్గెట్ గా టీడీపీ, టీడీపీ నేతలపై వైసీపీ
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం పై అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార వైసీపీ కనుసన్నల్లోనే డ్రగ్స్ దందా సాగుతుందని, తాలిబన్ డ్రగ్స్ కు తాడేపల్లి కి లింక్ ఏంటి అంటూ టిడిపి నేతలు నిత్యం జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఏపీ డ్రగ్స్ వ్యవహారం వెనుక బిగ్ బాస్ ఎవరు అంటూ జగన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురు దాడి చేస్తున్న వైసీపీ నేతలు చంద్రబాబు అండ్ గ్యాంగ్ డ్రగ్స్ దందా మొదలుపెట్టారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇక టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు గంజాయి వ్యాపారం వ్యాపారం చేసేవాడు అంటూ అయ్యన్నపాత్రుడు పై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అయ్యన్నపాత్రుడు తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని వైసిపి నేతలకు సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications