బాబు! ఎక్కువ మాట్లాడ్తున్నావ్, కాస్కో కక్కిస్తా: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రాంతంలో తాము అధికారంలోకి వస్తామని చంద్రబాబు ఈ మధ్య పదే పదే అంటున్నారని, ఆయన చెప్పేది జోక్ ఆప్ ది మిలీనియం అన్నారు. చంద్రబాబు చరిత్ర అంతా తన వద్ద ఉందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వమే ఏర్పడుతుందని.. చంద్రబాబు ఇక కాసుకో అన్నారు.
ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలను తాము బయటకు తీస్తామన్నారు. భూ అక్రమాలు బయటకు తీసి, డబ్బులను కక్కిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు చరిత్ర మొత్తం తన వద్ద ఉందని చెప్పారు.

కాగా, రాయల తెలంగాణకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు అంగీకరించారని, తాము రోడ్డు పైకి వస్తే అప్పుడు ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లిందన్నారు. తెలంగాణకు న్యాయం అడిగితే రెచ్చగొట్టినట్లా అని ప్రశ్నించారు. తెలంగాణలో అన్ని ఎంపీ సీట్లను తెరాస గెలుచుకోవాలన్నారు. తెలంగాణ కోసం తెరాస పోరాడుతుందన్నారు.
ఎపి భవన్లో రెండు వందల మంది ఉద్యోగులు ఉంటే తెలంగాణవాళ్లు ముగ్గురే ఉన్నారని విమర్శించారు. ఇప్పుడు జరుగుతున్న పంపకాలు మాడ్యూల్స్ మాత్రమే అన్నారు. ఉభయ ప్రాంతాలకు సిఎంలు, సిఎస్‌లు వస్తారని, అప్పుడే పంపకాలు జరుగుతాయన్నారు. తెరాస దేనిని వదులుకోదన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా తెరాస ప్రభుత్వం కాపాడుతుందన్నారు.












Click it and Unblock the Notifications