బావిలో పడిన గున్న ఏనుగు, ఆగ్రహంతో పొలాలు ధ్వంసం చేసిన ఏనుగులు
చిత్తూరు: జిల్లాలోని రామకుప్పం మండల పరిధిలోని వీర్నమల పంచాయతీ చుట్టుపల్లె తండా గ్రామ శివార్లలో శనివారం అర్థరాత్రి నీళ్లు లేని ఓ బావిలో ఏడాది వయస్సున్న ఏనుగు ప్రమాదవశాత్తు పడిపోయింది.
అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్థులు కలసి ఇరవై ఏనుగుల గుంపును పంట పొలాల వైపు చొరబడకుండా ప్రయత్నిస్తుండగా మగ ఏనుగు ప్రమాదవశాత్తు 25 అడుగుల లోతు ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయింది.
దీంతో ఏనుగుల గుంపు ఘీంకారాలు చేస్తూ అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని విరిచివేసి బావిలో పడ్డ ఏనుగును బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో తెల్లవారుజాము వరకు అటవీ సిబ్బంది పెద్దఎత్తున టపాకాయలు పేల్చి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతానికి వెళ్లేలా చేశారు.

ఆదివారం ఉదయం కుప్పం రేంజ్ కాలప్ప నాయుడు, సిబ్బంది, కుప్పం సిఐ రాజశేఖర్, రాళ్లబూదుగూరు ఎస్సై గోపి, స్థానిక పోలీసులు కలసి జెసిబి యంత్రం ద్వారా బావిలోకి మట్టిని నింపుతూ ఏనుగును బయటకు తీశారు.
జేసీబీ సాయంతో వ్యవసాయ బావికి సమాంతరంగా ఏటావాలుగా తవ్వి గున్న ఏనుగును బావిలోంచి బయటకు తీశారు. ఉదయం 10 గంటల సమయంలో గున్న ఏనుగు బావిలోంచి బయటపడి సమీపంలోని అటవీప్రాంతంలోకి పరుగు తీసింది. వ్యవసాయ బావిలో నేరు లేకపోవడంతో గున్న ఏనుగు ప్రాణాలతో బయటపడింది.
గున్న ఏనుగు బావిలో పడటాన్ని గమనించిన మిగిలిన ఏనుగులు ఆగ్రహంతో సమీపంలోని పొలాలను ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడిలో విద్యుత్ స్తంభం కూడా ధ్వంసమైంది. ఘటనాస్థలం ఏనుగుల ఘీంకారాలతో మార్మోగింది. దీంతో చిక్కపల్లి తండా వాసులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల దాడిలో 6 ఎకరాల్లో వరి, టమోటా, మామిడి తోట ధ్వంసమయ్యాయి.












Click it and Unblock the Notifications