బాబు అడిగితే వద్దన్న బాలకృష్ణ, ఒక్కమగాడని కితాబు
హైదరాబాద్: తనను మంత్రివర్గంలో చేరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడిగారని అయితే, ప్రజలతో మమేకమై ఉండేందుకు గాను మంత్రి వర్గానికి దూరంగా ఉంటానని చెప్పానని, హిందూపురంలోనే ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పాటు పడతానని చెప్పారు. ప్రాంతాలు వేరైనా తెలుగు వారు అంతా ఒక్కటేనని చెప్పారు. తెలంగాణలోను టిడిపికి మంచి పట్టు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కూడా పార్టీని గెలిపించుకునేలా అందరం పాటు పడదామన్నారు.
తెలుగు ప్రజల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పురోభివృద్ధి రెండు చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. తెలుగు జాతిని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లగల ఒక్కమగాడు చంద్రబాబు మాత్రమే అన్నారు. మంగళవారం బాలయ్య పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బసవతారకం కేన్సర్ ఇన్‌స్టిట్యూట్-ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి శాఖను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగుజాతికి రెండు రాష్ట్రాలైన సమయంలో మంత్రి పదవి తీసుకోవడం కంటే ఆస్పత్రి ద్వారా ఇరు రాష్ట్రాల ప్రజలకు ప్రపంచ స్థాయి కేన్సర్ చికిత్సలు అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నానన్నారు.

ఇప్పుడు తన మొదటి కర్తవ్యం హిందూపురం నియోజకవర్గం అభివృద్ది చేయడం, రెండోది ఆంధ్రప్రదేశ్‌లో కూడా బసవతారకం కేన్సర్ ఆస్పత్రిని నెలకొల్పడమేనన్నారు. ఏపీలో ఆస్పత్రి ఏర్పాటుపై విధివిధానాలను బోర్డు మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ తనను గెలిపించిన హిందూపురం నియోజకవర్గానికి వరాలు ప్రకటించారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించడం తన ముందున్న కర్తవ్యమన్నారు. ఇప్పటికే హిందూపురం స్థానిక అధికారులు, కార్యకర్తలతో పలు అంశాలపై చర్చించానని, నియోజకవర్గంపై పూర్తి అవగాహన పెంచుకున్నానని ఆయన చెప్పారు. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎంతో దగ్గరగా ఉన్న హిందూపురంను హార్డ్‌వేర్ హబ్‌గా తిర్చిదిద్దుతానన్నారు.
హిందూపూరంలో హార్డ్‌వేర్ పరిశ్రమలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి ద్వారా స్థానిక యువతకు ఉపాధి పొందడానికి అవసరమైన ప్రత్యేక శిక్షణ ఎన్టీఆర్ స్కిల్డ్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఒక వైపు సినీనటుడుగా, మరోవైపు ఆస్పత్రి చైర్మన్‌గా, ఇంకోవైపు ఎమ్మెల్యేగా మూడు ముఖ్యమైన సేవలు చేసే భాగ్యం తనకు లభించిందన్నారు. ఇటువంటి అవకాశం అందరికీ రాదన్నారు.
సినిమాల్లో కొనసాగుతా
శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాక సినిమాలకు దూరంగా ఉండాలని తానెప్పుడు అనుకోలేదన్నారు. తన 98వ చిత్రం విజయవంతం కావడం, తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ఏపీలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం అన్ని శుభశకునాలు, శుభసూచనలన్నారు. త్వరలో వందవ చిత్రం కూడా పూర్తి చేస్తానన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న పిల్లలతో బాలకృష్ణ కాసేపు గడిపారు. ఈ సందర్బంగా పిల్లలకు బహుమతులు అందజేశారు.












Click it and Unblock the Notifications