ఎన్టీఆర్‌పై పుస్తకం రాస్తా-భారతరత్న ఇచ్చిన వారికే గౌరవం- మహానాడులో బాలకృష్ణ
కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో డిజిటల్‌గా నిర్వహిస్తున్న టీడీపీ వార్షిక పండుగ మహానాడులో టాలీవుడ్ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ ఉద్వేగభరితంగా మాట్లాడారు. తన తండ్రి ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకుంటూ ఆయన గొప్పదనాన్ని ప్రశంసించారు. తెలుగు జాతిని ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్నఇస్తే ఇచ్చిన వారికి ఆ గొప్పదనం దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ చరిత్రను తాను పుస్తకంగా రాస్తానని, పాఠశాలల్లో సైతం పాఠ్యాంశంగా చేర్చాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల్ని బాలకృష్ణ కోరారు.

ఎన్టీఆర్‌లో మూడక్షరాల అర్దమిదే
టీడీపీ మహానాడు సందర్భంగా తన తండ్రి దివంగత ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌లో మూడక్షరాలకు తనదైన శైలిలో బాలయ్య అర్ధం చెప్పారు. ఇందులో ఎన్ అంటే
నటనా నిలయంలో నటరాజ నరసింహుడు అని, టీ అంటే తారామండలంలో తారక ధృవతారకుడు అని, ఆర్ అంటే రాజకీయ దురంధరుడు అని బాలకృష్ణ భాష్యం చెప్పారు.

ఎన్టీఆర్‌పై పుస్తకం రాస్తా
పుట్టిన గడ్డకు కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టేవాడే గొప్పవాడని, ఎన్టీఆర్ అలాంటి వారని బాలకృష్ణ తెలిపారు. ఆయన తనకు తండ్రి, గురువు అని, తన నరనరాల్లో ఎన్టీఆర్ అనే పదం ప్రవహిస్తుందన్నారు. ఎన్టీఆర్ ఆవేశంలో పుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. ఎన్టీఆర్ జీవితం పై నేనే పుస్తకం రాస్తానని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య అంశాల్లో చేర్చాలని ఆయన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. కరోనా పరిస్ధితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

బాలయ్య మాటల్లో ఎన్టీఆర్
మదరాసీయులుగా ఉన్న తెలుగువారికి తెలుగు జాతి ఉందనే విషయాన్ని గుర్తు చేసిన ఘనత ఎన్టీఆర్‌దే అని బాలకృష్ణ అన్నారు. నిరుపేదలకుకావాల్సిన కూడు,గూడు, గుడ్డ అందించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. మహిళల కోసం ప్రత్యేక యూనివర్సిటీ, ఆస్తుల్లో హక్కు, రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఆయనదే అన్నారు. ఎన్టీఆర్ పథకాల్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేశాయన్నారు.
హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు ముందుచూపుతో రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. బడుగుల్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ అన్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే.. ఆ ఇచ్చేవారు వారిని వారు గౌరవించుకున్నట్లవుతుందన్నారు. ఎన్టీఆర్ అనే మూడక్షరాలు వింటే తన రక్తం పొంగుతుందన్నారు. రోమాలు నిక్కపొడుచుకుంటాయన్నారు. ఇక నుంచి ఎవరికీ భయపడేది లేదు. ఒకరికొకరు అండగా ఉండాలి, ప్రాణాలు పణంగా పెట్టయినా పోరాడాలి, కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని మహానాడులో తీర్మానం చేయాలని బాలకృష్ణ సూచించారు. రామారావు గారి అంశను స్ఫూర్తిని తీసుకుని ముందుకెళ్లేవారికి అపజయం అంటూ ఉండదని తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంతవరకూ ఎన్టీఆర్ కీర్తి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications