బాలినేని నిర్ణయం ఏంటి - ఒంగోలు వైసీపీలో ఏం జరుగుతోంది..!!
ఎన్నికల వేళ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో ఇంఛార్జ్ ల మార్పు వేళ సీట్లు దక్కని కొందరు పార్టీ వీడుతున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి బాలినేని సైతం వైసీపీ వీడుతున్నారని ప్రచారం మొదలైంది. ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకు కేటాయించాలని బాలినేని పట్టు బట్టారు. ఇందుకు సీఎం అంగీరించలేదు. ఈ సమయంలో బాలినేని ప్రకాశంలో సీట్ల ఖరారు.. తాను పార్టీ మారటం పైన క్లారిటీ ఇచ్చారు.
ఇంఛార్జ్ ల మార్పు : వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాల్లో పలువురు సిట్టింగ్ లను మార్పు చేయాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఒంగోలు ఎమ్మెల్యేగా తిరిగి బాలినేనిని ఖరారు చేసారు. ఎంపీగా మాగుంటను తప్పించాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు బాలినేని అంగీకరించలేదు. మాగుంటను కొనసాగించాలని కొద్ది రోజులుగా పార్టీ హైకమాండ్ మీద ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ మాత్రం ససేమిరా అంటోంది. తాజాగా ఇదే అంశం పైన బాలినేని తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలతో సమావేశమయ్యారు. ఎంపీ సీటు వ్యవహారం పైన చర్చించారు. ఇప్పటికే ఎంపీగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఖరారు చేసామని పార్టీ సమాచారం ఇచ్చింది. చెవిరెడ్డి పార్టీ ఎంపీ అభ్యర్ది అయితే స్థానికేతరుడుగా ప్రచారం జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

బాలినేని కీలక వ్యాఖ్యలు : మాగుంటకు అవకాశం ఇవ్వాలని మరోసారి కోరారు. పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో బాలినేని తిరిగి వెళ్లిపోయారు. దీంతో, బాలినేని పార్టీ మారుతున్నారని ప్రచారం మొదలైంది. దీని పైన బాలినేని స్పందించారు. ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం తనకు ముఖ్యమన్నారు. ఎంపీ అభ్యర్థి మాగుంట అయితే అన్ని నియోజకవర్గాల్లో బాగుంటుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ పరిధిలో మిగిన వాళ్లకు లేని బాధ తనకు ఎందుకని వ్యాఖ్యానించారు.అధిష్టానం ఏం చెబితే అదే చేస్తానని స్పష్టం చేసారు. ఎంపీ అభ్యర్థిగా ఎవరు వచ్చినా ఒంగోలులో తన గెలుపు తాను చూసుకుంటానని చెప్పుకొచ్చారు. దీని ద్వారా పార్టీ మారటం లేదని క్లారిటీ ఇచ్చారు.

సీట్లు దక్కేదెవరికి : ఇక, ఇదే సమయంలో జిల్లాలోనూ పలు మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీతో పాటుగా కందుకూరు, గిద్దలూరు అంశంలో నిర్ణయం ఏంటనేది కీలకంగా మారనుంది. గిద్దలూరు అభ్యర్ది ఎంపిక పైన బాలినేని సూచనలు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు వైసీపీ ఇంఛార్జ్ ల మార్పు అయిదో జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications