బాలినేనికి షాకిచ్చిన పవన్ కల్యాణ్.. పార్టీలో చేరకుండానే ఝలక్
మాజీ మంత్రి బాలినేని నేడు (గురువారం) పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరనున్నారు. అయితే తొలుత బలప్రదర్శన చేసి, అనుచరగణంతో ఘనంగా పార్టీలో చేరాలని బాలినేని భావించినా... అందుకు జనసేన అధిష్ఠానం నిరాకరించింది.ర్యాలీకి అనుమతి కోరినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పార్టీలో చేరికపై బాలినేని కొంత బెట్టు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జనసేన అధిష్టానం నుంచి ఎటువంటి మార్పులేకపోవడంతో బాలినేని మెట్టు దిగకతప్పలేదు. చేసేది లేక నిరాడంబరంగా ఒక్కరే పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు.
మొదట జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఒంగోలుకు రప్పించి... బలప్రదర్శన నిర్వహించి, అనుచరగణంతో ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని బాలినేని భావించారు. అయితే బాలినేని చేరికను కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారినా గత పాపాల నుంచి తప్పించుకోలేరని బాలినేనిపై టీడీపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. దీంతో బాలినేనిని సైలెంట్‌గా పార్టీలో చేర్చుకోవాలని పవన్ కల్యాణ్ భావించారు. ఒంగోలులో సభ అవసరం లేదనీ, ఒక్కరే మంగళగిరి వచ్చి చేరాలని బాలినేనికి జనసేన అధిష్ఠానం కబురుపంపింది. ఆయనతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ కూడా పార్టీలో చేరతారని ప్రకటించింది.

దీంతో మాజీమంత్రి చేరిక ప్రత్యేక కార్యక్రమం కాదన్నది స్పష్టమైంది. దీనికి అనుగుణంగానే ఆయనను ఒక్కర్నే పార్టీలో రావాలని కోరడం జరిగింది. ఊహించని పరిణామంతో మాజీ మంత్రి శిబిరం డీలాపడింది. ఒకానొక దశలో చేరిక వాయిదా పడిందన్న ప్రచారమూ సాగింది. కినుక వహించినా పరిస్థితిలో మార్పులేకపోవడంతో బాలినేని మెట్టు దిగిరాక తప్పలేదు. తాను చేరాక మిగతా వారినీ పవన్‌కల్యాణ్ సమక్షంలోనే పార్టీలో చేరుస్తానని క్యాడర్‌తో ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. బాలినేనితో పాటు ఈ రోజు(గురువారం) వైసీపీ కీలక నేతలు జనసేనలో చేరనున్నారు. సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య ఇవాళ జనసేనలో చేరుతున్నారు. వీరితో పాటు, పలువురు వైసీపీ నేతలు సైతం జనసేనలో చేరుతారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరందరికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పనున్నారు.












Click it and Unblock the Notifications