బైక్ కవర్ లో డబ్బులు పెట్టి టిఫిన్ తినడానికి వెళ్లాడు.. అంతే..
దొంగలు తమ చేతివాటాన్ని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కన్ను మూసి తెరిచేలోగా మాయం చేసేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద కస్టమర్లుగా నటించి ఎవరు ఎక్కువ మొత్తంలో విత్ డ్రా చేస్తున్నారు.. అని గమనించి.. నగదు యజమానిని వెంబడించి మరీ దోచేస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఇలాంటి ఘటనే జరిగింది. బైక్ ట్యాంక్ కవర్ లో ఉంచిన రెండు లక్షలు నగదును మాయం చేశాడు ఓ దొంగ. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నరసాపురం మండలం వేములదీవి గ్రామానికి ఉంగరాల శ్రీను.. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో రెండు లక్షలు నగదును విత్ డ్రా చేసి తన బులెట్ వాహనం ట్యాంక్ పై ఉన్న కవర్ లో భద్రపరిచాడు. అలానే ఇంటికి వెళుతూ పంజా సెంటర్ లోని హోటల్ వద్ద ఆగి బండిని టిఫిన్ సెంటర్ ముందు పార్కింగ్ చేసి టిఫిన్ తినడానికి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి కవర్ లో నగదు మాయం అయింది.
శ్రీనును అప్పటికే బ్యాంక్ నుండి వెంబడించిన దొంగలు హోటల్ వద్ద ఆగి బైక్ కవర్ లో ఉన్న రెండు లక్షలు నగదును మాయం చేశారు. హోటల్ సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా టోపీ పెట్టుకున్న వ్యక్తి బైక్ లో ఉన్న నగదు కొట్టేసినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇలాంటి ఘటనలు మాత్రమే కాదని డైవర్షన్ చేసి వస్తువులు దొంగలించటం, చైన్ స్నాచింగ్ ఇలా ఒక్కో నేరస్తుడు ఒక్కో విధంగా చోరీలకు పాల్పడుతున్నారు. అయితే అన్ని వేళలా అప్రమత్తంగా వుండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications