బ్యాంకులో ఉన్న మీ బంగారం సేఫేనా? ఎందుకంటే!
కష్టకాలంలో ఆదుకుంటుందని నమ్మి, ప్రాణంగా దాచుకున్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెడితే.. అక్కడ గజదొంగలు పడ్డారు. నమ్మకానికి మారుపేరుగా నిలవాల్సిన బ్యాంకు లాకర్ల నుంచే సామాన్యుల బంగారం మాయమైంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వరుసగా బాధితులు బయటకు వస్తుండటంతో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తీవ్ర కలకలం రేగింది. నమ్మిన బ్యాంకు ముంచేయడంతో ఖాతాదారులు శనివారం సదరు బ్యాంకు ముందు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు.
కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామానికి చెందిన గవరవరపు లక్ష్మణయ్య అనే ఖాతాదారుడు 2024లో జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పక్క రోడ్డులో ఉన్న 'బ్యాంక్ ఆఫ్ బరోడా' శాఖలో తన రెండు బంగారు గొలుసులు, ఒక బొందును తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. రూపాయి రూపాయి వెనకేసి, శనివారం నాటికి వడ్డీతో సహా రూ. 3 లక్షల రుణాన్ని పూర్తిగా చెల్లించేశారు. ఇక తన నగలు తన చేతికి వస్తాయని ఆశగా ఎదురుచూసిన లక్ష్మణయ్యకు బ్యాంకు సిబ్బంది షాక్ ఇచ్చారు. మొత్తం సొమ్ము కట్టినా, 3 కాసుల బంగారు గొలుసు మాయమైనట్లు గుర్తించారు. దీనిపై లక్ష్మణయ్య సిబ్బందిని గట్టిగా నిలదీయడంతో అసలు గుట్టు బయటపడింది.

ఒకరి వెంట ఒకరు.. కన్నీరు మున్నీరు!
లక్ష్మణయ్య బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్న సమయంలోనే, కొయ్యలగూడెం మండలానికి చెందిన మరో మహిళా ఖాతాదారుడు కంగుతినే వార్త వినాల్సి వచ్చింది. గత రెండు రోజులుగా బ్యాంకు గోల్డ్ అప్రైజర్ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఆమె బ్యాంకుకు వచ్చారు. తన వద్ద ఉన్న రశీదులు చూపించి.. తాను తాకట్టు పెట్టిన 10 కాసుల బంగారం ఎక్కడని ప్రశ్నించగా, ఆ ఆభరణాలు కనిపించడం లేదని సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో సదరు మహిళ బ్యాంకులోనే కన్నీటిపర్యంతమయ్యారు. అదే సమయంలో జంగారెడ్డిగూడేనికి చెందిన శ్రావణ్‌కుమార్ అనే మరో బాధితుడు వచ్చి ఆరా తీయగా.. ఆయన తాకట్టు పెట్టిన బంగారంలో ఏకంగా 17 కాసుల వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.
అప్రైజర్ పరార్.. సిబ్బంది కుమ్మక్కయ్యారా?
ఇలా ఒకరి తర్వాత ఒకరి బంగారం మాయం కావడంతో దాదాపు 30 కాసుల పైగా బంగారం కాజేసినట్లు స్పష్టమవుతోంది. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న చలపాక రాజు, బ్యాంకులోని మరికొందరు సిబ్బంది కుమ్మక్కై పక్కా ప్లాన్ ప్రకారమే తమ బంగారాన్ని కాజేశారని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పట్టణంలో దావాగ్నిలా వ్యాపించడంతో.. మిగిలిన ఖాతాదారులు సైతం భయంతో బ్యాంకుకు పరుగులు తీశారు. "మా నగలు మాకు చూపించండి" అంటూ సిబ్బందిని చుట్టుముట్టడంతో బ్యాంకు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రంగంలోకి పోలీసులు.. ఇంటర్నల్ ఆడిట్!
సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు తక్షణమే బ్యాంకు వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితులను సముదాయించి, న్యాయం జరిగేలా చూస్తామని, రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వాలని సూచించారు.
మరోవైపు ఈ ఘోర ఉదంతంపై బ్యాంకు మేనేజర్ భాస్కరరావును వివరణ కోరగా.. గత రెండు రోజులుగా అప్రైజర్ రాజు విధులకు రావడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్యాంకులో ఇంటర్నల్ ఆడిట్ (అంతర్గత తనిఖీలు) జరుగుతున్నాయని, బంగారం వ్యత్యాసాలపై బాధితుల నుంచి ఫిర్యాదులు సేకరించామని తెలిపారు. ఈ వ్యవహారాన్ని బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మేనేజర్ వెల్లడించారు. తాకట్టు పెట్టిన బంగారమే మాయం కావడంతో సామాన్య ప్రజలు బ్యాంకుల్లో దాచుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు.














Click it and Unblock the Notifications