ఒకే బ్యాంక్ రెండు శాఖలలో చోరీలు: గ్యాస్ కట్టర్లతో..
హైదరాబాద్: అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దోపీడీలు జరిగాయి. ఈ సంఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని సప్తగిరి బ్యాంకులో చోరీ జరిగింది. దొంగతనం శనివారం రాత్రి జరిగింది. సోమవారం ఉదయం దాన్ని గుర్తించారు. పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలోని సప్తగిరి బ్యాంకునే దొంగలు ఎంచుకున్నారు. అర్ధరాత్రి వేళ కిటికీ తొలగించి లాకర్లలోని బంగారు ఆభరణాలను అపహరించారు. 115 సవర్ల బంగారం, డైమండ్ నెక్లెస్, 15 కిలోల వెండి విలువ రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా.
బ్యాంకు వెనుక ఉన్న కిటికీని గ్యాస్ కట్టర్‌తో తొలగించారు. దాని ద్వారా లోపలకు వెళ్లిన దుండగులు సీసీ కెమెరాల కనెక్షన్లు తొలగించారు. అలారం పని చేయకుండా చేసి, గ్యాస్ కట్టర్‌తో 8 సేఫ్టీ లాకర్లను తెరిచారు. వీటిలో ఆరు ఖాళీగా ఉండగా.. బుచ్చినాయుడు కండ్రిగ మండలం నెలవాయిలోని నరసింహులు నాయుడుకు చెందిన లాకరులోని 45 సవర్ల బంగారం, 3 కిలోల వెండి, అదే మండలం వెస్ట్ వరత్తూరు వాసి హరినాథ్ రెడ్డికి చెందిన మరో లాకరులో 70 సవర్ల బంగారం, డైమండ్ నెక్లెస్, 12 కిలోల వెండి దొంగతనం చేశారు. వీటి విలువ రూ.50 లక్షలకుపైగా ఉంటుందని అంచనా.
శనివారం రాత్రి చోరీ జరిగినా, ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఉదయమే బ్యాంకు సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుత్తూరు డీఎస్పీ నాగేశ్వరరావు, ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వంశీధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మండల కేంద్రంలో పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలోని బ్యాంకునే లూటీ చేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

దుండగులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. దొంగలు తెచ్చుకున్న సిలిండర్‌లో ‘గ్యాస్' అయిపోవడంతో మరో వైపున ఉన్న బ్యాంకు లాకరు జోలికి దుండగులు వెళ్లలేదు. గ్యాస్ అయిపోకుండా.. వాటినే కనుక తెరచి ఉంటే రూ.15 కోట్ల విలువైన బంగారు నగలు పోయేవని అంటున్నారు. బ్యాంకు మేనేజరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఒకే ఊళ్లో ఒకే బ్యాంకుకు చెందిన రెండు శాఖల్లో దొంగలు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకుకు చెందిన భూపాలపల్లిలోని రెండు శాఖల్లో చోరీ జరిగింది. భారీగా నగదు, బంగారాన్ని దొంగలు అపహరించుకు పోయారు. వరంగల్ జిల్లా ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా కథనం ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలో ఏపీజీవీబీ పట్టణ శాఖ, కారల్‌మార్క్స్ కాలనీలో ఆజంనగర్ గ్రామీణ శాఖ బ్రాంచిలు ఉన్నాయి.
శనివారం సాయంత్రం బ్యాంకుకు తాళాలు వేసుకుని వెళ్లిపోయిన అధికారులు సోమవారం ఉదయం వచ్చి చూసే సరికి షట్టర్‌తో పాటు లాకర్‌లు తెరిచి ఉన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. భూపాలపల్లి ఎస్సై వెంకట్ బ్యాంకుకు చేరుకుని పరిశీలించారు. అనంతరం వరంగల్ జిల్లా ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా, ములుగు డీఎస్పీ మురళీధర్‌లు సంఘటన స్థలానికి చేరుకుని బ్యాంకు అధికారులతో చర్చించారు. ఈ చోరీల్లో రెండు బ్యాంకుల్లో ఉన్న రూ.20లక్షల నగదుతోపాటు సుమారు రూ. ఐదు కోట్ల విలువైన బంగారం అపహరణకు గురైనట్లు ఎస్పీ చెప్పారు.
తాళాలు పగలగొట్టి లేవని, లాకర్‌ల తాళాలు తీసి మరీ దొంగలు చోరీకి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. బ్యాంకు సిబ్బంది సహకారంతోనే ఈ చోరీ జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను గుర్తిస్తామని, ఖాతాదారులెవరూ ఆందోళనకు గురి కావద్దని ఎస్పీ కోరారు.












Click it and Unblock the Notifications