రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి, స్నేహితుడి సాయంతో భార్యను చంపిన భర్త
గుంటూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని 16వ జాతీయ రహదారి పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి తేజ సుమంత్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి సుమంత్ ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
సోమవారం ఉదయం తన స్నేహితుడు గాయత్రి సుమన్‌తో కలిసి ద్విచక్ర వాహనం పైన కాలేజీకి బయలుదేరాడు. దుగ్గిరాల బైపాస్‌లో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మారుతి కారు వీరిని ఢీకొంది. దీంతో సుమంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సుమన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

భార్యను చంపిన భర్త
గర్భస్రావానికి ఆమె అంగీకరించలేదని భార్య ప్రాణం తీశాడు ఓ భర్త. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున మండలంలోని మోర్జంపాడులో చోటు చేసుకుంది. నర్మద(23)కు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి ఉన్నా ఆలనా, పాలనా పట్టించుకోక పోవడంతో ఆమె బాల్యం అంతా గ్రామంలోని అమ్మమ్మ దగ్గర గడిచింది.
తన మనవరాలిని ఇంజినీరింగ్ వరకు చదివించి, గత ఏడాది మార్చిలో క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన నరసింహా రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. నర్మద ఇటీవల గర్భం దాల్చింది. గర్భం తీయించుకోమని భర్త భార్యను హింసిస్తుండేవాడు.
మూడోనెల కావటంతో నిద్ర చేసేందుకు నర్మద నాలుగు రోజుల క్రితం మోర్జంపాడులోని అమ్మమ్మ దగ్గరకు వచ్చింది. ఆదివారం రాత్రి భర్త నరసింహా రెడ్డి, అతని స్నేహితుడు పానెం శంకర్ రెడ్డితో కలిసి మోర్జంపాడులోని భార్య వద్దకు వచ్చాడు. డాబాపైకి వెళ్లి భార్యభర్తలు నిద్రకు ఉపక్రమించారు.
ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. గర్భం తీయించుకోమని చెప్తే మాట వినట్లేదని భర్త హెచ్చరించాడు. ఇద్దరి నడుమ మాటమాట పెరగటంతో భర్త నరసింహా రెడ్డి, అతని స్నేహితుడు శంకర్ రెడ్డి సాయంతో భార్యను చున్నితో గొంతు నులిమి చంపాడు.
ఏమీ తెలియనట్లు ఆమెను డాబా మెట్లపై పడుకోబెట్టి అక్కడ ఉండే కడ్డీలకు చున్ని కట్టి ఉరి వేసుకున్నట్లు నాటకం ఆడాడు. ఉదయాన్నే నర్మద అమ్మమ్మ చూసి కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి నర్మదను కిందకు దించారు. అప్పటికే ఆమె చనిపోయింది. భర్త, అతని స్నేహితుడు పరారయ్యారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications