జూన్ 8, 9న చేప ప్రసాదం పంపిణీ: బత్తిన హరినాథ్
హైదరాబాద్: ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ రోజు నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ ఈ సారి జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్టు బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేప ప్రసాదం పంపిణీ వివరాలను ఆయన వెల్లడించారు.

ఉబ్బసం, ఆస్తమా, దగ్గు, దమ్ము వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు బత్తిని సోదరులు అందించే చేపమందు ప్రసాదం ఈ సారి కూడా లక్షాదిమందికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 8వతేదీ సాయంత్రం 5.20గంటలకు ప్రారంభమయ్యే చేపమందు పంపిణీ 9వతేదీ రాత్రి 9గంటలకు వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.

సౌకర్యాల ఏర్పాటు కోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను కలిశామని హరినాథ్ తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది రోగులకు అసౌకర్యం కలగకుండా ప్రతి ఏటా ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తోందని ఈసారి కూడా ప్రభుత్వమే ఆ బాధ్యత నిర్వహించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ, ట్రాఫిక్, మత్య్సశాఖ, మెట్రోవాటర్ వర్క్స్, విద్యుత్‌శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, ఆర్టీసీ తదితర శాఖలు సహకారం అందించాలని హరినాథ్ విజ్ఞప్తి చేశారు.
ఉబ్బస వ్యాధిగ్రస్తులు తప్పకుండా చేపమందు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో హరినాథ్ తోపాటు బత్తిని మృగశిర కార్తీ చేపమందు ప్రసాదం పంపిణీ అధ్యక్షులు బి.విశ్వనాథం, బి.జయలక్ష్మి, ఉమామహేశ్వరగౌడ్, శివ, శివానందగౌడ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications