బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం- ఏపీలో విస్తృతంగా వర్షాలు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో భారీగా వర్షాలు కురుస్తోన్నాయి. పలు జిల్లాల్లో దంచికొడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడుతున్నాయి. ప్రత్యేకించి- కోస్తాజిల్లాలపై దీని తీవ్రత అధికంగా ఉంటోంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర నుండి ఉత్తర తమిళనాడు ఈ అల్పపీడనం విస్తరించింది. తీరం మీదుగా కొనసాగుతోంది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడింది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ఏపీవ్యాప్తంగా చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.

నేడు అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలు అంతటా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఆయా జిల్లాల్లో పలుచోట్ల ఎడతెరిపిగా వర్షం పడుతోంది.
మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ఆ సమయంలో చెట్లు, హోర్డింగుల కింద నిల్చోవద్దని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications