'చంద్రబాబు రావడం సంతోషమే కానీ, అమరావతివాసుల్ని భయపెడుతున్నారు'
విజయవాడ: రాజధాని అమరావతి ప్రాంతవాసుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనవసరంగా భయాందోళనలు సృష్టిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పార్థసారథి మండిపడ్డారు. ఇప్పుడు రాకెట్ లాంచర్ల ప్రస్తావన ఎందుకు తెచ్చారో చెప్పాలన్నారు.
వాటి పేరుతో సచివాలయ నిర్మాణ వ్యయ అంచనాలను పెంచుతున్నారని దుయ్యబట్టారు. ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారని రేపు ఎవరైనా ప్రశ్నిస్తే.. అడ్డం పెట్టుకోవడానికి ముందుగానే ఆయన రాకెట్ లాంఛర్లతో ప్రారంభించడం దారుణం అన్నారు.
చంద్రబాబు ఎన్నికల్లో గెలవగానే పదేళ్ల పాటు హైదరాబాదులోనే ఉంటానని చెప్పానని గుర్తు చేశారు. కానీ రెండేళ్లు కాకుండానే హడావుడిగా అమరావతికి ఎందుకు పరుగులు పెట్టవలసి వచ్చిందో చెప్పాలన్నారు. చంద్రబాబు ఏపీలోనే ఉంటూ పాలించడం మాకు సంతోషమే అన్నారు.

కానీ కనీసం కుర్చీ, కార్యాలయం, ఫ్యాన్ లేని పరిస్థితుల్లో తాత్కాలిక భవనాలను నిర్మించడం అనుమానాలు రేకిత్తిస్తోందన్నారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో తెలంగాణ పోలీసుల నుంచి ముప్పు ఉందనే భయంతో వచ్చేశారన్నారు.
సింగపూర్, టోక్యో, చైనా అన్నీ కడతామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, తాత్కాలిక భవనాలను నిర్మించడం మంచిదే కాదనీ, ప్రతిదానిని అశుభంగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చేసిన సంతకాలలో ఒక్కటి అమలు కాలేదన్నారు.
నల్లధనం గురించి చంద్రబాబు మాట్లాడటం చూస్తుంటే దేశంలోని ప్రజలంతా విస్తుపోతున్నారని దుయ్యబట్టారు. దేశంలోనే అతి ధనవంతుడైన ముఖ్యమంత్రి కలిగినది ఏపీ అని సర్వేలు చెప్పినవి నిజం కాదా చెప్పాలని ప్రశ్నించారు.

కేంద్రం ప్రకటించిన అక్రమ ఆదాయ వెల్లడి పథకం గురించి ఆయన మాట్లాడారని, ఏ ప్రాంతం నుంచి ఎంత నల్లడబ్బు వచ్చిందన్న విషయాన్ని తాము చెప్పబోమని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే పట్టించుకోవద్దని చెప్పారన్నారు.
కానీ బాధ్యత కలిగిన సీఎం.. హైదరాబాదులో ఇంత డబ్బు వచ్చిందని, అది కూడా ఒకే వ్యక్తి, ఒకే సంస్థ పదివేల కోట్లు వెచ్చించిందని ఎలా చెబుతున్నారని నిలదీశారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఒక వ్యక్తి అంటారని, ఆ తర్వాత మంత్రులు జగన్ పదివేల కోట్లు వెల్లడించాలని కేబినెట్ మంత్రులు ఆరోపించడం ఏమిటన్నారు.
పథకం ప్రకారం జగన్ పైన బురద జల్లుతున్నారన్నారు. వాళ్లకు నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ ఉంటే కనీసం ఒక శాతమైనా నిజాయితీ ఉందని అనుకుంటే తమ సవాలు స్వీకరించాలన్నారు. ఈ పదివేల కోట్ల రూపాయలు ఎవరు వెల్లడించారో ఆధారాలతో సహా బయట పెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications