అది తేలిన తర్వాతే APలో KCR మొదటి అడుగు?
భారత రాష్ట్ర సమితి తన తొలి వేదికగా విశాఖపట్నాన్ని ఎన్నుకుంది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ కు నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓటింగ్ రాబట్టడంపై దృష్టిపెట్టారు. తొలిగా ఏపీ, తర్వాత మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా 6 శాతం ఓటింగ్ కోసం సభలు నిర్వహించబోతున్నారు. కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్ మద్దతుతో అవసరమైన ఓటింగ్ రాబట్టడం సులువవుతుందని భావిస్తున్నారు. తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర జిల్లాల నుంచి ఓటింగ్ వస్తుందనే అంచనాలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది.

ఖండించిన తోట
పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నియమితుడైన తోట చంద్రశేఖర్ పై బీజేపీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 40 ఎకరాల ప్రభుత్వ భూమిని తోట చంద్రశేఖర్ కంపెనీ ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ కు కట్టబెట్టారని, రూ.4వేల కోట్లకు అమ్మారంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఆ నగదుతోనే ఖమ్మంలో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే బీజేపీ ఆరోపణలను తోట చంద్రశేఖర్ తిప్పికొట్టారు. చిల్లర రాజకీయాల కోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఆ స్థలం అమ్మామంటూ బీజేపీ నేతలు చెబుతున్నారని, వారు చెబుతున్నది నిరూపిస్తే అందులో 90 శాతం స్థలం వారే ఉంచుకోవచ్చని, 10 శాతం తనకిస్తే చాలన్నారు.

ఏపీలో కుల రాజకీయాలకే ప్రాధాన్యం?
ఏపీలో కుల రాజకీయాలకు ప్రాధాన్యత ఉండటంతో భారత రాష్ట్ర సమితి వాటినే పునాదిగా చేసుకొని తనకు అవసరమైన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని భావిస్తోంది. కేసీఆర్ సామాజికవర్గానికి చెందినవారు ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉండటంతో అక్కడే సభ నిర్వహిస్తున్నారు. తోట చంద్రశేఖర్ కూడా విశాఖపట్నంలో సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దానికి సంబంధించిన తేదీని కేసీఆర్ ప్రకటిస్తారన్నారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరికలుంటాయని, అవి త్వరలోనే ప్రారంభమవుతాయని తోట చెబుతున్నారు.

నివేదిక అందిన తర్వాత ఖరారు?
మొదటి సభ విశాఖపట్నంలో నిర్వహించిన తర్వాత ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? వార్తమాన రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తున్నారా? గతానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నారా? ప్రజల నాడి ఎలా ఉంది? కేసీఆర్ పార్టీపై ఇక్కడి ప్రజల మనసుల్లో ఏముంది? తదితర విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అంతర్గతంగా ఈ విషయాలపై ప్రజల మనోభావాలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక సంస్థ ఏపీలో పనిచేస్తోంది. అది నివేదిక అందించిన తర్వాత విశాఖపట్నం సభ ఖరారయ్యే అవకాశం ఉందని భారత రాష్ట్ర సమితి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications