తుని విధ్వంసం, కాల్ డేటాతో: సీఐడీ ముందుకు భూమన, ముద్రగడను కలవలేదని..
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పదకొండు గంటలకు సీఐడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఎనిమిది నెలల క్రితం కాపు గర్జన సమయంలో తుని విధ్వంసం తెలిసిందే.
తుని విధ్వంసం ఘటనలో భూమన సహా ఇరవై మందికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. తమ ఎదుట సెప్టెంబర్ 6వ తేదీన హాజరు కావాలని అందులో సూచించింది. దీంతో భూమన ఈ రోజు గుంటూరు జిల్లాలోని సీఐడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యారు. కాల్ డేటా ఆధారంగా విచారిస్తున్నారు.

తుని ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కాపు ఉద్యమాన్ని నీరుగార్చేందుకే తమ పైన కేసులు పెట్టారని విచారణ నిమిత్తం వచ్చిన భూమన ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు బనాయించిందన్నారు.
చట్టం పైన గౌరవంతో తాను విచారణకు హాజరవుతున్నానని చెప్పారు. తుని కేసుతో తనకేం సంబంధమన్నారు. తుని ఘటనకు ముందు కానీ, ఆ తర్వాత కానీ తాను కాపు నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ కాలేదని చెప్పారు.
కాగా, తుని విధ్వంసం ఘటనలో ప్రతిపక్ష నేతలను ఉద్దేశ్య పూర్వకంగా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తనను టిడిపి టార్గెట్ చేసిందని భూమన పలుమార్లు చెప్పారు. భూమన, రోజా వంటి వారిపై టిడిపి కక్ష సాధిస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications