తీసివేతల టార్గెట్ ఫిక్స్.. గెలుపే జగన్ లక్ష్యం; మంత్రి బొత్సా ఆసక్తికర వ్యాఖ్యలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా సిట్టింగ్ ల మార్పు మార్పు వ్యవహారం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీలో 175 కి 175 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని మార్పులు చేర్పులు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ నిర్ణయాలపై క్లారిటీ ఇచ్చారు. తీసివేతల టార్గెట్ ఫిక్స్ అన్నారు.
సీఎం జగన్ మాటల మనిషి కాదని చేతల మనిషి ఆయన స్పష్టం చేశారు. చేనేత కార్మికులు, బడుగు బలహీన వర్గాలకు జగన్ ధైర్యాన్ని ఇచ్చారని, అందులో భాగంగానే మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గంజి చిరంజీవిని తీసుకొచ్చి జాయిన్ చేశారని మంగళగిరి అభ్యర్థిగా చిరంజీవిని నిర్ణయించారని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆర్కే కు ఏ విధంగా సముచిత స్థానం ఇవ్వాలో అలానే చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఏ ఒక్కరినీ పార్టీ వదులుకోలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీఎం జగన్ నిర్ణయం వెనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలని ఆలోచన ఉన్నట్టు పేర్కొన్నారు. పార్టీ అంటే ఎమ్మెల్యేలతో పాటు కేడర్ కూడా అని పేర్కొన్న బొత్స సత్యనారాయణ మొదటి దశలో 175 సీట్లను పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. వీలైనంతవరకు అందరికీ సమచితస్థానం ఇస్తామని తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న మార్పుల వల్ల కొంతమంది బాధపడి ఉండొచ్చు.. కానీ జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ జగన్ నిర్ణయాలను అర్థం చేసుకుంటారని తల్లిలాంటి పార్టీని వదలకుండా కట్టుబడి పని చేస్తారని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.
జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించిన నాటి నుండి పార్టీని ప్రజలకు జవాబుదారీగా ఉంచారని అందులో భాగంగానే ఆయన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందని పేర్కొన్నారు. 11 నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేయడం వెనుక ప్రజా అభీష్టం ఉందని పేర్కొన్న ఆయన భవిష్యత్తులో భారీగానే మార్పులు ఉండబోతున్నాయని స్పష్టం చేశారు. జగన్ ఏం చేసినా చెప్పే చేస్తున్నారని, ప్రజలకు మళ్ళీ సేవ చేసే పరిస్థితి రావాలని తాజా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో గెలుపే లక్ష్యంగా ప్రస్తుత నిర్ణయాలు ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications