వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్!!
వైసిపి ప్రభుత్వ హయాంలో గత సంవత్సరం ఫిబ్రవరి 21 తేదీన గన్నవరంలోని టిడిపి ఆఫీస్ పై దాడి ఘటన జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ప్రభుత్వం ఈ దాడి ఘటన పైన పట్టించుకోకపోవడం, టిడిపి నేతలపైనే తప్పుడు కేసులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గతంలో టిడిపి ఆఫీసులపై జరిగిన దాడి ఘటనల పైన తాజాగా కేసులు నమోదు చేస్తోంది.
వల్లభనేని వంశీ అరెస్ట్ కోసం గాలిస్తున్న పోలీసులు
ఇక ఈ క్రమంలోనే గన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడి ఘటనపైన నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ అనుచరులే దాడికి పాల్పడిన వారని గుర్తించి వంశీ అనుచరులను అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు చెప్పడంతో వల్లభనేని వంశీ పైన కూడా పోలీసులు కేసు నమోదుచేసి వంశీని అరెస్ట్ చేయడానికి గాలిస్తున్నారు.

హైకోర్టును ఆశ్రయించిన వల్లభనేని వంశీ
అయితే అప్పటినుంచి ఇప్పటివరకు వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడో పోలీసులు పట్టుకోలేక పోయారు. నేడో రేపో వల్లభనేని వంశీ అరెస్టు జరుగుతుందని మళ్లీ తాజాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వల్లభనేని వంశీ తరుపు న్యాయవాదులు పిటిషన్ పైన వాదనలు వినిపించారు.
ఆగస్ట్ 20 వరకు చర్యలు తీసుకోకండి
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరిత చర్యలో భాగంగా వల్లభనేని వంశీ పైన కేసు పెట్టారని లాయర్ వాదించారు. ఇక టిడిపి పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన ఘటనలో వల్లభనేని వంశీ ప్రమేయం ఉందంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈనెల 20వ తేదీ వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
కౌంటర్ దాఖలుకు పోలీసులకు ఆదేశం
అంతేకాదు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. దీంతో వల్లభనేని వంశీకి హైకోర్టులో కాస్త రిలీఫ్ దొరికినట్లు అయింది. ఈనెల 20వ తేదీ వరకు వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు లేదు. ప్రస్తుతానికి ఈ కేసులో వల్లభనేని వంశీకి కాస్త ఉపశమనం దొరికినట్లయింది.
గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసుల దూకుడు
తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ నిందితుడుగా గన్నవరం కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్న సమయంలో వంశీ హైకోర్టు మెట్లు ఎక్కారు.
వల్లభనేని వంశీ ఎక్కడ?
ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. గత నెల వంశీ విజయవాడలో తన నివాసానికి వచ్చిన సమయంలో టిడిపి శ్రేణులు దాడులకు దిగాయి. దీంతో పోలీసులు కేంద్ర బలగాలు రంగ ప్రవేశం చేసి రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాయి. ఆ తర్వాత వంశీ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ ఉన్నాడు? అన్నది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.












Click it and Unblock the Notifications