కొంపముంచిన బీజేపీతో పొత్తు..అప్పుడే ఓ వికెట్ డౌన్..?
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ , .జనసేన పార్టీ కూటమితో బీజేపీ చేతులు కలపడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీని ఎదుర్కొనడానికి బీజేపీతో కలిసి ముందుకు వెళ్తేనే మేలని భావించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్..ఆ దిశగా కూటమిలోకి బీజేపీని తీసుకురావడంలో విజయవంతం అయ్యారు. అయితే ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన జగన్ సర్కార్ ,బీజేపీపై ఎలా ఎదురుదాడికి దిగుతుందనేది వేచి చూడాలి.
ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ , జనసేన మరెన్ని స్థానాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు లోక్‌సభ స్థానాలను ఆశించిన జనసేన ఇప్పుడు బీజేపీ ఎంట్రీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అటు బీజేపీ సైతం ఆరు పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేయడంతో టీడీపీ నాయకులు త్యాగాలకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలోనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీటుకు ఎసరు వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి.

ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ , జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. టీడీపీ , జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో నరసాపురం సీటు ఆ పార్టీకి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో నరసాపురం నుంచి బీజేపీ విజయం సాధించి ఉండటంతో ఆ స్థానం తమకు కేటాయించాలని రాష్ట్ర బీజేపీ నాయకులు పట్టుపడుతున్నారు. నరసాపురం రేసులో మాజీ బీజేపీ ఎంపీ, సినీ నటుడు కృష్ణంరాజు భార్య సతీమణి శ్యామలా దేవి , నరేంద్ర వర్మ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే హీరో ప్రభాస్‌ను బీజేపీ అధినాయకత్వం తమవాడిగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు శ్యామలా దేవికి నరసాపురం టికెట్ ఇవ్వడం ద్వారా ప్రభాస్‌ను పార్టీకి మరింత దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో బీజేపీ నాయకత్వం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ ఇమేజ్‌ను నేషనల్ లేవల్లో వినియోగించుకోవాలని బీజేపీ పెద్దలు చూస్తున్నారు. ఈక్రమంలోనే నరసాపురం టికెట్ శ్యామలా దేవికి కేటాయించి ప్రభాస్‌ను దగ్గర చేసుకునే ప్రయత్నాలు బీజేపీ నాయకులు మొదలు పెట్టారని తెలుస్తోంది.

ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు గట్టి షాకే తగిలినట్టే. పొత్తులో భాగంగా నరసాపురం స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే రఘురామ కృష్ణంరాజుకు భంగపాటు తప్పదు. ఇది రఘురామ కృష్ణంరాజు రాజకీయ జీవితానికి పెద్ద ఎదురు దెబ్బ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రఘురామకు నరసాపురం స్థానాన్ని కాదని మరోచోట టికెట్ ఇచ్చే పరిస్థితిలో టీడీపీ లేదు. దీంతో రఘురామ రాజకీయ జీవితం సందిగ్ధంలో పడినట్లు అయింది.
ఒకవేళ నరసాపురం టికెట్ బీజేపీకి కేటాయిస్తే.. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రఘురామ కృష్ణంరాజు నామిటేడ్ పదవిని ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి బీజేపీతో పొత్తు వల్ల వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీటుకే ఎసరొచ్చింది. మరి దీనిపై రఘురామ కృష్ణంరాజు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది నియోజకర్గ ప్రజలు ఆతృతుగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications