ఆయేషా మీరా కేసులో బిగ్ ట్విస్ట్..! తల్లితండ్రులకు సీబీఐ కోర్టు నోటీసులు..!
18 ఏళ్ల క్రితం విజయవాడలోని బాలికల హాస్టల్లో రేప్, హత్యకు గురైన బీఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును సుదీర్ఘంగా పలుమార్లు పోలీసులతో పాటు సీబీఐ కూడా విచారించాయి. సీబీఐ తాజా విచారణలో భాగంగా గతంలో నిందితుడిగా పేర్కొని రిమాండ్ లో ఉంచిన సత్యంబాబుపై సెక్షన్ల నమోదుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆమె తల్లితండ్రులకు విజయవాడ సీబీఐ కోర్టు ఇవాళ నోటీసులు పంపింది.
బీ ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా హత్య జరిగి 18 ఏళ్లు గడిచిపోతున్నా అసలు నిందితులు ఎవరో తేల్చడంలో పోలీసులు, సీబీఐ కూడా విఫలమయ్యాయి. ఇంకా చెప్పాలంటే అసలు నిందితుల్ని వదిలేసి అమాయకుల్ని అరెస్టు చేసి ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా గతంలో ఆమెను రేప్, హత్య చేశాడని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన అనుమానితుడు సత్యంబాబుపై సెక్షన్ 376, సెక్షన్ 302 కింద అభియోగాల నమోదుకు సంబంధించి ఇప్పుడు తల్లితండ్రుల అభిప్రాయం తెలుసుకోవాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది.

దీంతో ఆయేషా మీరా తల్లితండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషాకు విజయవాడ సీబీఐ కోర్టు ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. దీంతో వారు 19న కోర్టుకు హాజరై సత్యంబాబు విషయంలో ఏం చెప్పబోతున్నారనేది కీలకంగా మారింది. గతంలో అసలు నిందితుల్ని వదిలేసి సత్యంబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆయేషా మీరా తల్లితండ్రులు ఆరోపించారు. ఆ తర్వాత ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి సత్యంబాబును విడుదల చేశారు.

ఆ తర్వాత సీబీఐ ఈ కేసులో మరోసారి దర్యాప్తు చేపట్టింది. అలాగే ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని కూడా మరోసారి బయటికి తీసి రీపోస్టు మార్టం నిర్వహించింది. అయినా వాస్తవాలు వెలుగు చూడలేదు. ఈ కేసులో సీబీఐ నిర్లక్ష్యంపై ఆయేషా మీరా తల్లితండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలువురు రాజకీయ నేతల్ని, అధికారుల్ని కలిసి వినతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్లుండి విజయవాడ సీబీఐ కోర్టు తల్లితండ్రులకు ఇచ్చిన నోటీసులు, అందులోనూ సత్యంబాబుపై అభియోగాలపై కావడం సంచలనం రేపుతోంది.












Click it and Unblock the Notifications