బీహార్ ఫలితాలు: ప్రత్యేక హోదాపై మోడీపై చంద్రబాబు ఒత్తిడి?
హైదరాబాద్: బీహార్ ఫలితాలు ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్ర మోడీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒత్తిడి పెంచడానికి అవకాశం కల్పించినట్లు భావిస్తున్నారు. హామీలను అమలు చేయకపోతే మొదటికే మోసం వస్తుందని ఆయన మోడీపై ఒత్తిడి పెంచడానికి బీహార్ ఫలితాలు అవకాశం కల్పించాయని అంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీపై తాము చేస్తున్న విమర్శల దాడి నుంచి రాష్ట్ర బిజెపి నేతలు వెనక్కి తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆ రకంగా చంద్రబాబుకు ఊరట లభిస్తుందని చెబుతున్నారు.
బీహార్ ఫలితాలపై స్పందించేందుకు కూడా రాష్ట్ర బిజెపి నేతలు ముందుకు రావడం లేదు. బీహార్ ఫలితాలతో రాష్ట్రంలో తమకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడం కూడా ఇబ్బందిగానే మారుతుందని అంటున్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి విపక్షాలు చేస్తున్న విమర్శలపై బీజేపీ నాయకులు కొంతకాలంగా ఎదురుదాడి చేస్తున్నారు.

దీనిపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ గెలిచి ఉంటే ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలతోపాటు మిత్రపక్షమైన టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ధైర్యంగా తిప్పికొట్టవచ్చని బీజేపీ నేతలు భావించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక హోదా డిమాండ్‌పై విపక్షాలు తమ స్వరాన్ని మరింత పెంచుతాయని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో టీడీపీ కూడా ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పార్టీని విస్తరించడానికి మంచి అవకాశం ఏర్పడిందని బీజేపీ భావిస్తూ వస్తున్నారు. తమ పార్టీ పెరుగుతుండడాన్ని టిడిపి నేతలు సహించలేకపోతున్నారనే వ్యాఖ్యలు బిజెపి నాయకుల నుంచి ఇంతకు ముందు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆ మాటలు అనడానికి వెనకాడే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ప్రత్యేక హోదా ప్రధాన ఆటంకంగా మారుతుందనే భయం కూడా బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications