కేసీఆర్ నిర్ణయం: కోదండకు ఓయు విద్యార్థుల ఝలక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్‌కు ఆదివారం చుక్కెదురైంది. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జూనియర్ లెక్చరర్ల సంఘం విద్యా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి వారు వచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అడ్డుకున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించవద్దని వారు నినాదాలు చేశారు. ఓయు విద్యార్థులు అడ్డుకోవడంతో దాదాపు అరగంట పాటు కొంత గందరగోళం చెలరేగింది.

కాగా, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో గత కొద్ది రోజులుగా ఓయు విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఉద్యోగ ప్రకటనలు ఇవ్వనందుకు నిరసనంగా శనివారం విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పూడ్చి పెట్టారు. తెలంగాణలో విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాలు లేని తెలంగాణ తెస్తామని చెప్పిన కేసీఆర్ నేడు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications